సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులు, కౌలుదారుల కుటుంబాల పేరిట బ్యాంకు అకౌంట్లలో నేరుగా పెట్టుబడి సాయాన్ని మంగళవారం జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 40 లక్షల మంది రైతులు, కౌలు రైతుల కుటుంబాలు ఇందుకు అర్హమైనవిగా అధికారులు తేల్చారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం మరో 14 లక్షల మంది వరకు లబ్ధిదారుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేస్తారు.
► ‘వైఎస్సార్ రైతు భరోసా’ ప్రకటించిన తేదీ, ప్రాంతం: జులై 8వ తేదీ 2017 – గుంటూరు (పార్టీ ప్లీనరీలో)
► తొలుత అర్హత : ఐదు ఎకరాలలోపు సన్న, చిన్నకారు రైతులు
► తర్వాత మారిన అర్హత : అన్నదాతలందరికీ వర్తింపు
► తొలుత ప్రకటించిన సాయం : ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000
► తాజాగా ప్రకటించిన సాయం : ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలలో రూ.67,500
► జగన్ ప్లీనరీలో ప్రకటన తర్వాత ఇదే తరహా పథకాన్ని (రైతు బంధు) అమలు చేసిన రాష్ట్రం : తెలంగాణ
► కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పథకం : పీఎం కిసాన్ సమ్మాన్ యోజన
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే రైతుభరోసా ప్రారంభోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్టాళ్లను పరిశీలించిన తర్వాత రైతుభరోసా చెక్కులు పంపిణీ చేసి అన్నదాతలతో మాట్లాడతారు. సభ ముగిశాక రేణిగుంట చేరుకుని విమానంలో గన్నవరం వెళ్తారు.
వైఎస్సార్ రైతు భరోసా నేడు ప్రారంభం
Published Tue, Oct 15 2019 5:37 AM | Last Updated on Tue, Oct 15 2019 8:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment