
సాక్షి, నెల్లూరు: ‘వచ్చే నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయ్, మన నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. దీనికి పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాల’ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం (రేపు) వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు వేడుకలను మనం జరుపుకొంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని, చంద్రబాబులాగా పొత్తులకు వెంపర్లాడబోదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి.. పచ్చజెండా కట్టాలంటే టీడీపీ నాయకులు భయపడేలా మన ప్రభుత్వం తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఐదు నెలల్లో టీడీపీ నేతలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుందని అన్నారు.