కేశవులు మృతదేహం
సాక్షి, అనుమసముద్రంపేట(నెల్లూరు): పెళ్లింట్లో విద్యుద్దీపాలంకరణ చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈఘటన మండలంలోని చౌటభీమవరం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై సమాచారం మేరకు.. ఆత్మకూరు పట్టణం జేఆర్‌పేటకు చెందిన డీ చెన్నకేశవుల కుమారుడు కేశవులు (26) ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. గతేడాది ఆత్మకూరులో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి నష్టాలు రావడంతో మూతవేశాడు. కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లకు లైటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం చౌటభీమవరానికి చెందిన భీమవరపు సురేష్ వివాహ వేడుకలకు లైటింగ్ పనులు చేసేందుకు వెళ్లారు. ఉదయం 5 గంటల సమయంలో చేతులు కడుక్కునేందుకు వాటర్ డ్రమ్ముల వద్దకు వెళ్లాడు.
అక్కడ విద్యుత్ వైరుకు సరఫరా వచ్చి అక్కడికక్కడే పడిపోయాడు. గ్రామస్తులు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేశవులు మృతితో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఏఎస్‌పేట ఎస్సై గోపాల్ ఏరియా వైద్యశాలకు చేరుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment