వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే.. | Sakshi
Sakshi News home page

వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..

Published Tue, Mar 5 2024 1:05 AM

- - Sakshi

చెట్టుకు ఢీకొన్న కారు.. ఐదుగురు దుర్మరణం
ఘటనా ప్రాంతంలో ఇది మూడో ప్రమాదం
కొత్తకోట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన కారు

వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్‌ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్‌ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్‌ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు.

అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్‌ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్‌ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి

ఇది మూడో ఘటన..
2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్‌లో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు.
● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్‌ వాహనం డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు.
● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

జాగ్రత్తలు పాటించాలి
అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్‌ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు.

మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్‌ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్‌ రహమన్‌, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం.

Advertisement
 
Advertisement