నెల్లూరు సిటీ: సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్లుగా తయారైంది నగర పాలక సంస్థ మున్సిపల్ షాపుల పరిస్థితి. 20 ఏళ్లకుపైగా కొందరి కబంధ హస్తాల్లో మున్సిపల్ షాపులు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ, రాజకీయ నాయకుల అండదండలతో షాపు లీజుదారులు కొనసాగుతున్నారు. బయట వ్యక్తులకు ఎక్కువ మొత్తానికి షాపులను అద్దెకు ఇచ్చి కార్పొరేషన్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం వెనుకంజ వేస్తున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 14 మున్సిపల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులు ఉండగా, వాటిలో 64 షాపులు 20 ఏళ్లకు పైబడి కొందరి చేతుల్లో ఉన్నాయి. మరో 100 నుంచి 120 షాపులను పదేళ్లకుపైగా కొందరు బినామీలు నడుపుతున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం షాపు లీజుకు తీసుకుని మూడేళ్లు దాటితే వేలం పాట నిర్వహించాలి. అయితే ఈ నిబంధనలు అమలు కావడంలేదు. కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కొన్ని సార్లు వేలం పాటలు నిర్వహించేందుకు యత్నించినా బడాబాబులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అడ్డుకుని షాపు లీజుదారుడికే కట్టబెట్టుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
లీజుదారుడు ఒకరు.. బాడుగకు ఉండేది మరొకరు...
మున్సిపల్ షాపులను లీజుకు తీసుకున్న వారు మాత్రమే షాపు నిర్వహణ చేయాలి. అయితే లీజుదారుడు కార్పొరేషన్‌కు తక్కువ బాడుగ చెల్లిస్తూ బయట వ్యక్తికి ఎక్కువ బాడుగలకు ఇస్తున్నారు. చిన్నబజారు, డైకాస్‌రోడ్డు, మద్రాసుబస్టాండు, గాంధీబొమ్మ సెంటర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో కొందరు షాపులను వేలం పాటలో రూ.5 నుంచి రూ.7వేలకు తీసుకుని, బయట వ్యక్తికి అదే షాపును రూ.10వేల నుంచి రూ.15వేలకు బాడుగకు ఇస్తున్నారు. వేలం పాటలు నిర్వహించపోవడంతో ఏటా లక్షల రూపాయల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది.
మున్సిపల్ షాపుల వేలానికి అడ్డంకులు
గతంలో పనిచేసిన కమిషన్ పీవీవీఎస్ మూర్తి కార్పొరేషన్ పరిధిలోని 25 ఏళ్ల లీజు నిండిన 65 షాపులకు వేలం పాట నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. షాపుల వేలం పాట తేదీని సైతం ప్రకటించారు. అయితే ఆయా షాపుల లీజుదారులు కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా వేలం పాట నిలిపివేశారు. ఇది జరిగి ఒకటన్నర ఏడాది కావస్తున్నా అధికారులు అటు వైపుగా కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వేలం పాటలకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
షాపింగ్ కాంప్లెక్ పేరు | షాపుల సంఖ్య |
ప్రకాశం పంతులు కాంప్లెక్స్ | 18 |
సుబేదారుపేట కాంప్లెక్స్ | 13 |
బీవీఎస్‌ఎం కాంప్లెక్స్ | 16 |
పప్పులవీధి కాంప్లెక్స్ | 24 |
ఏసీ భవన్ కాంప్లెక్స్ | 12 |
పనుతల వారి కాంప్లెక్స్ | 13 |
చిన్నబజారు కాంప్లెక్స్ | 38 |
డైకాస్‌రోడ్డు | 06 |
సౌదాన్య కాంప్లెక్స్ | 15 |
డైకాస్‌రోడ్డు కాంప్లెక్స్ | 05 |
ఏసీ విహార్ కాంప్లెక్స్ | 05 |
ఏసీ సుబ్బారెడ్డి కాంప్లెక్స్ | 22 |
Comments
Please login to add a commentAdd a comment