ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్లో 37 శాతం వృద్ధి
ఎనిమిది నగరాల్లో 885 లక్షల కోట్ల ఎస్‌ఎఫ్‌టీ
2024పై కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) మార్కెట్లో సందడి నెలకొంది. 2024లో ఈ మార్కెట్లో లీజు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 37 శాతం వృద్ధితో 123 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) స్థూల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. 2023లో 90 లక్షల ఎస్‌ఎఫ్‌టీ మేర లావాదేవీలు జరగడం గమనార్హం. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 885 లక్షల చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) విస్తీర్ణం మేర స్థూల లీజింగ్ 2024లో నమోదైనట్టు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది.
అంతకుముందు ఏడాది 746 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 19 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. ‘‘భారత ఆఫీస్ మార్కెట్‌కు 2024 నిర్ణయాత్మకమైనది. రికార్డు స్థాయిలో లీజింగ్ నమోదైంది. ఆఫీస్ స్పేస్‌కు అంతర్జాతీయంగా భారత్ బలమైన వృద్ధి మార్కెట్ అని మరోసారి నిరూపితమైంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ పేర్కొన్నారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) పెరుగుతుండడం బహుళజాతి సంస్థలకు భారత్ వ్యూహాత్మక ప్రాధాన్యమైనదిగా తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో 30 శాతం డిమాండ్ జీసీసీల నుంచే వస్తోంది. ‘‘2025లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బలంగా ఉండనుంది. అంతర్జాతీయ ఆఫీస్ మార్కెట్లో భారత్ ఆధిపత్యం బలపడనుంది’’అని జైన్ అంచనా వేశారు. తాజా లావాదేవీలు, రెన్యువల్ అన్నీ స్థూల లీజింగ్ కిందకే వస్తాయి.
పట్టణాల వారీగా లీజింగ్..
→ బెంగళూరులో 259 లక్షల చదరపు అడుగుల స్థూల లీజింగ్ లావాదేవీలు 2024లో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది లీజింగ్ పరిమాణం 158.3 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా 64 శాతం వృద్ది ఇక్కడ నమోదైంది.
→ ముంబైలో స్థూల లీజింగ్ 27 శాతం పెరిగి 178.4 లక్షల చదరపు అడుగులకు చేరింది.
→ అహ్మదాబాద్‌లో 11 శాతం అధికంగా 18.1 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజు లావాదేవీలు జరిగాయి.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మాత్రం క్రితం ఏడాదితో పోలి్చతే 3 శాతం తక్కువగా 131.4 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి.
→ పుణెలో 84.7 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ రికార్డు అయింది. 2023లో లీజు పరిమాణం 97.4 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో పోల్చితే 13 శాతం తగ్గింది.
→ కోల్‌కతా ఆఫీస్ మార్కెట్లో 17 లక్షల చదరపు అడుగుల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే స్థిరంగా కొనసాగింది.
→ ఐటీ–బీపీఎం, ఇంజనీరింగ్ అండ్ తయారీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాలు ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో ప్రముఖ పాత్ర పోషించాయి.
→ మొత్తం స్థూల లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు 14 శాతం తీసుకున్నారు. ప్రాపర్టీ యజమానుల నుంచి ఆఫీస్ స్పేస్ లీజు తీసుకుని, కార్పొరేట్లు, ఇతరులకు వీరు లీజుకు ఇవ్వనున్నారు.
తగ్గిన ఖాళీ స్థలాలు.. 2024లో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో రికార్డు స్థాయి లావాదేవీలు నమోదైనట్టు, ఖాళీ స్థలాలు గణనీయంగా తగ్గినట్టు ముంబైకి చెందిన రహేజా కార్ప్ ఎండీ, సీఈవో వినోద్ రోహిరా తెలిపారు. మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చే అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment