రిటైల్ షాపింగ్ మాల్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో 2024–27 మధ్య కాలంలో 18 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ రిటైల్ షాపింగ్ మాల్స్ విస్తీర్ణం (స్పేస్/వసతి) అందుబాటులోకి వస్తుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంస్థ అంచనా వేసింది. ఈ కాలంలో తాజా డిమాండ్‌లో ఇది మూడింట ఒక వంతుగా తెలిపింది. భారత్‌లో తలసరి రిటైల్ స్పేస్ ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్, థాయిల్యాండ్, వియత్నాం తదితర దక్షిణాసియా దేశాల కంటే తక్కువగా ఉందని.. రిటైల్ స్పేస్ భారీ వృద్ధి అవకాశాలను ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం టాప్–8 పట్టణాల్లో రిటైల్ స్పేస్ 60 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు తెలిపింది. అంటే 2027 నాటికి మొత్తం రిటైల్ మాల్స్ విస్తీర్ణం 78 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోన్నట్టు అంచనా వేసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కొత్తగా ఒక్క మాల్ కూడా నిర్వహణలోకి రాలేదని తెలిపింది. భారత్ మాదిరే తలసరి ఆదాయం కలిగిన ఇండోనేíÙయాతో పోల్చి చూస్తే.. 2027 నాటికి తలసరి రిటైల్ స్పేస్ 1.0కు చేరుకునేందుకు గాను భారత్‌లో 55 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర అదనంగా రిటైల్ మాల్స్ నిరి్మంచాల్సిన అవసరం ఉంటుందని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వివరించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. సరఫరా పెరిగేలా చర్యలు అవసరం.. ‘‘భారత రిటైల్ రంగం కీలక దశలో ఉంది. వినియోగదారుల విశ్వాసం, విచక్షణారహిత వినియోగం పెరుగుతుండడం ఈ రంగం సామర్థ్యాలను తెలియజేస్తోంది. ఈ వృద్ధి అవకాశాలను సది్వనియోగం చేసుకునేందుకు సరఫరా వైపు సవాళ్లను పరిష్కరించడం ఎంతో అవసరం. నాణ్యమైన రిటైల్ వసతులు లభించేలా చర్యలు తీసుకోవాలి. చురుకైన భారత రిటైల్ మార్కెట్ అవసరాలను తీర్చేందుకు 55 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ వసతి అదనంగా అవసరం. ఈ దిశగా స్థిరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు పరిశ్రమ భాగస్వాముల సమిష్టి కృషి అవసరం. తద్వారా భారత రిటైల్ రంగం పూర్తి సామర్థ్యాలను అందుకోగలుగుతుంది’’అని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ సౌరభ్ శట్దాల్ వివరించారు. గురుగ్రామ్ తదితర పట్టణాల్లో నాణ్యమైన రిటైల్ మాల్ వసతులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నట్టు సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ సైతం తెలిపారు. మెరుగైన షాపింగ్, వినోదం అన్నింటినీ ఒకే చోట వినియోగదారులు కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రీమియం షాపింగ్ డిమాండ్ ప్రస్తుత సరఫరా మించి ఉన్నట్టు ఎలారా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వినీత్ దావర్ తెలిపారు. టైర్–2, 3 నగరాల్లో మాల్స్ విస్తరణ వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు.