న్యూఢిల్లీ: కార్యాలయ వసతుల(ఆఫీస్ స్పేస్) మార్కెట్ ఈ ఏడాది మంచి జోరును కొనసాగించింది. గతేడాదితో పోల్చితే సుమారు 14 శాతం అధికంగా 85 మిలియన్ చదరపు అడుగుల మేర (ఎస్‌ఎఫ్‌టీ) స్థూల లీజింగ్ ఈ ఏడాది ఎనిమిది ప్రధాన నగరాల్లో నమోదవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తన అంచనాలు వెల్లడించింది. 2023లో ఇవే నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం.
‘‘ఎనిమిది ప్రధాన నగరాల్లో 2022 నుంచి ఆఫీస్ స్పేస్ స్థూల లీజింగ్ ఏటా 70 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీపైనే ఉంటూ వస్తోంది’’అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వివరించింది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 66.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ స్థూల లీజింగ్ లావాదేవీలు జరిగినట్టు ప్రకటించింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2018లో 49.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2019లో 67.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2020లో 46.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2021లో 50.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2022లో 72 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ, 2023లో 74.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ చొప్పున నమోదైనట్టు ఈ నివేదిక వెల్లడించింది.
ఈ రంగాల్లో డిమాండ్ అధికం..
ముఖ్యంగా ఐటీ–బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (ఐటీ–బీపీఎం), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్‌ఐ), ఇంజనీరింగ్, తయారీ రంగాలతోపాటు, ఫ్లెక్స్ ఆపరేటర్ స్పేస్ విభాగాలు ఈ వృద్ధిని నడిపిస్తున్నట్టు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగాలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు తెలిపింది. ‘‘2024 భారత ఆఫీస్ రంగానికి రికార్డుగా నిలిచిపోతుంది. స్థూల లీజింగ్ ఈ ఏడాది 85 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరుకోవచ్చు.
ఇందులో నికర వినియోగం 45 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చు. భారత వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో అత్యధిక గరిష్ట స్థాయి ఇది’’అని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ తెలిపింది. మొత్తం ఆఫీస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) 30 శాతం వాటా ఆక్రమిస్తాయని పేర్కొంది. డిమాండ్ పెరగంతో ప్రముఖ ప్రాంతాల్లో కార్యాలయ వసతుల అద్దెల పెరుగుదలపై ఒత్తిడి నెలకొన్నట్టు తెలిపింది. ‘‘2025లో అధిక శాతం నూతన వసతుల సరఫరా ప్రముఖ ప్రాంతాల చుట్టూనే ఉండనుంది. స్థిరమైన సరఫరాతో అద్దెల పెరుగుదల మోస్తరు స్థాయిలో ఉండనుంది. దీంతో కిరాయిదారుల అనుకూల సెంటిమెంట్ కొంత కాలం పాటు కొనసాగనుంది’’అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment