సాక్షి, నెల్లూరు: ఈ ఇద్దరూ ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే. కానీ వారి పార్టీలు వేరు. పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో విధినిర్వహణలో ఉన్న అధికారులపై దౌర్జన్యాలు, దాడులు చేసినా కూడా స్టేషన్ వద్దకు కూడా పిలిపించకుండా నోటీసు ఇచ్చి అక్కడ పోలీసులు మమ అనిపించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేపై మాత్రం ఎఫ్‌ఐఆర్ నమోదైన గంటల వ్యవధిలో భారీ పోలీసుల బలగాల సాయంతో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇదీ ప్రస్తుతం చంద్రబాబు పాలనలో నడిచిన పోలీస్ ‘పచ్చ’పాతం.
వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఆ పార్టీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు చినబాబు సారథ్యంలో జిల్లాకు చెందిన టీడీపీ పెద్దలు పోలీస్ శాఖలోని కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుని పచ్చ కుట్రలకు తెర తీశారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదు నుంచి అరెస్ట్‌ల పర్వం వరకు ఆ ముగ్గురు పోలీస్ అధికారులే స్క్రీన్‌ప్లే దర్శకత్వం వహించి జైలుకెళ్లేలా వ్మూహాత్మకంగా వ్యవహరించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాపై పెద్దగా అవగాహన లేని పోలీస్ బాస్‌ను సైతం తప్పదోవ పట్టిస్తూ ఆ శాఖను ఆ ముగ్గురు తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కీలక పదవుల్లో వారే..
పోలీస్‌శాఖలో ప్రధానమైన ఇంటెలిజెన్స్, నగరంలో ఉన్న లా అండ్‌ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ శాఖలో ఉన్న పోలీస్ అధికారులు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి వారే. టీడీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన ఆ ముగ్గురు అధికారులు పథకం ప్రకారం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించేలా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే తొలి విడతగా ఎమ్మెల్యే కోటంరెడ్డిని జైలుపాలు చేయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న అధికారి ఏడాది కిందటే విజయవాడ నుంచి నెల్లూరుకు బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి కేవలం ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలపై ప్రత్యేక నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేస్తున్నారు.
అధికార పార్టీలో అసంతృప్తులను గుర్తించి వారి సమాచారం టీడీపీ పెద్దలకు చేరవేయడంతో పాటు వీరే నేతలను బుజ్జగించే పని కూడా చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ ఓటర్ల తొలగింపు, ప్రభుత్వ అనుకూల సర్వేలు కూడా ఇంటెలిజెన్స్ విభాగం అధికారి కనుసన్నల్లో నడుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్‌లో ప్రభుత్వ అనుకూలంగా సర్వే చేస్తూ పట్టుబడిన యువకులకు ఇంటెలిజెన్స్ అధికారి బహిరంగంగా అండగా నిలవడంతో పాటు సర్వే చేసిన యువకులను పట్టించిన వారిపై కేసులు నమోదు వరకు ఆ అధికారి అన్ని తానై నడిపించినట్లు తెలిసింది. నగరంలో ఉన్న లా అండ్ ఆర్డర్‌లో ఉన్న పోలీస్ అధికారి సైతం ప్రతిపక్ష పార్టీ నేతలపై చిన్న ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆయన స్వయంగా కలగజేసుకోవడం పాటు కేసులు పెట్టించి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
పోలీస్ బాస్ కనుసన్నల్లో నడిచే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల బదిలీల్లో కూడా ఆయన పాత్రే కీలకంగా ఉందని విమర్శలు లేకపోలేదు. అధికార పార్టీకి సహకరించే వారికే పోస్టులు ఇప్పించేలా వ్యవహరించారని ఆ శాఖలోనే విమర్శలు వెల్లువెత్తాయి. గత ఎన్నికల సమయంలోనే జిల్లాలోనే పని చేసిన ఆ అధికారి ప్రస్తుత ఎన్నికల సమయంలో కూడా కీలక పోస్టులోనే ఉన్నారు. జిల్లా పోలీస్ బాస్‌నుకు అన్ని తానై వ్యవహరించే సదరు అధికారి అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రతిపక్ష పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు ఆశాఖ నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్ వెనుక ఈ అధికా రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ముగ్గురే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా కుట్రలు పన్నే అవకాశాలు ఉంటాయన్న ఆరోపణలున్నాయి.
‘పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవడంతో పాటు దాడులు చేసిన ఘటనల్లో అక్కడ పోలీసులు 353 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినప్పటికి స్టేషన్‌కు కూడా పిలిపించకుండా సుప్రీంతీర్పు ప్రకారం 41 నోటీసు ఇచ్చారు’
‘నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే స్టేషన్‌కు వెళ్లి సీఐని ప్రశ్నిస్తే మాత్రం విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్నారంటూ కేసు నమోదు చేసి సుప్రీం తీర్పునకు విరుద్ధంగా 41 నోటీసు ఇవ్వకుండా కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపారు.’
Comments
Please login to add a commentAdd a comment