ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Taken Oath As Andhra Pradesh CM | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

Published Thu, May 30 2019 12:27 PM | Last Updated on Thu, May 30 2019 4:11 PM

YS Jagan Mohan Reddy Taken Oath As Andhra Pradesh CM - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’ అంటూ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారాయన. ప్రస్తుతానికి వైఎస్‌ జగన్‌ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జననేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటాన్ని  చూడాలనే కోరికతో ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరవ్వటంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకునే ముందు వైఎస్‌ జగన్‌ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

11.54 నిమిషాలకు తాడేపల్లిలోని తన స్వగృహంనుంచి విజయవాడకు బయలుదేరివచ్చారు. ఆయన వెంట వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల, అనిల్‌ సభా ప్రాంగణానికి వచ్చారు.  12.14 నిమిషాలకు పూలతో సుందరంగా అలంకరించిన ఓ  ప్రత్యేక వాహనంలో వైఎస్‌ జగన్‌ అక్కడి జనాలకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగారు. అనంతరం ఆయన స్టేజిమీదకు చేరుకుని మరోసారి ప్రజలకు అభివాదం చేయగా.. ఒక్కసారిగా ప్రజలు చేసిన కరతాళధ్వనులతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది.

ప్రమాణం స్వీకారానికి కొద్ది క్షణాల ముందు జాతీయ గీతాలాపన జరిగింది. ప్రమాణ స్వీకార సమయంలో ‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను’’ అని ఆయన అనగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రమాణస్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. నూతన ముఖ్యమంత్రికి మతపెద్దలు ఆశీర్వచనాలు ఇచ్చారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి : అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్‌ జగన్‌ మొదటి సంతకం

వైఎస్‌ జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వాదం

వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని పదేళ్లుగా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement