
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.