సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి ఆయన నామినేషన్ వేయనున్నారు.
అలాగే 7న కరీంనగర్‌లోని 24వ డివిజన్‌లో పాదయాత్ర ద్వారా ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, ఆ తరువాత సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటారు. ఇక ప్రతీరోజు ఉదయం 11 గంటల తర్వాత ఇతర నియోజకవర్గాలకు హెలికాప్టర్‌లో వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ తరఫున ప్రచారం చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో సంజయ్ ప్రచారానికి రావాలంటూ నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో ఆయనకు పార్టీ ప్రత్యేకంగా హెలికాప్టర్ కేటాయించింది. రోజూ రెండేసి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి షెడ్యూల్‌ను సిద్ధం చేసుకున్నారు. తొలుత 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట, 9న ఖానాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment