
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్‌భవన్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు.
విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్ పిలుపు
హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment