మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంగా ఎన్నికై పదేళ్లపాటు పనిచేసిన ప్రభుత్వాన్ని నియంతృత్వమని, ప్రజాస్వామ్య విలువలు లేవని చెప్పడం గవర్నర్ స్థాయికి తగదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి ఇది నిదర్శనమన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ కోసం కొట్లాడిన దాసోజుశ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ డిసెంబర్ 3వ తేదీ ముందు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి.. ఈ ఇద్దరు రాజకీయ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనే సాకు చూపుతూ అభ్యరి్థత్వాన్ని తిరస్కరించారు. కానీ ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కోదండరాంను కాంగ్రెస్ అదే గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తే గవర్నర్ ఎలా ఆమోదించారు? గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అమిత్ షా ఆదేశాల మీద వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్‌కి వెళ్లింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుని.. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ ఆదానీని విమర్శిస్తే రేవంత్ మరోవైపు అతనితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి ఇప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌కు మద్దతు పలకడమే ఆశ్చర్యకరం’’ అని కేటీఆర్ విమర్శించారు.
సర్పంచ్‌ల పదవీ కాలాన్ని పొడిగించాలి
గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేక ఇన్‌చార్జిలకు అప్పగించకుండా సర్పంచ్‌ల పదవీ కాలం పొడిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరోనా మూలంగా రెండేళ్ల పాటు సర్పంచ్‌లు పరిపాలన సాగించలేక పోయారని, ఈ నేపథ్యంలో వారి పదవీ కాలాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు లేదా తిరిగి ఎన్నిక నిర్వహించేంత వరకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచి్చన హోం శాఖ మాజీ మంత్రి మహమూద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న కేటీఆర్ చొరవతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న మహమూద్ అలీ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment