ఎమ్మెల్సీలుగా మా అభ్యర్థిత్వాన్ని ఆమోదించండి
గవర్నర్ తమిళిసైకి దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు.
రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment