ఆసిఫాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం.. జల్, జంగల్, జమీన్ కోసం నిజాం పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు.. కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఈసారి ఆయన సొంత గడ్డ అయిన జోడేఘాట్‌లోనే జరగనున్నాయి. దీంతో భీమ్ వర్ధంతి వేడుకలు పూర్వవైభవం సంతరించుకోనున్నాయి. దీనికితోడు ఈ నెల 8న నిర్వహించే ఈ వర్ధంతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతుండడం విశేషం.
మొన్నటి వరకు హట్టికే పరిమితం..
ఆదివాసీల్లోని అసంతృప్తిని తొలగించి.. వారికి ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో 1984లో ఐటీడీఏ ఆధ్వర్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో అధికారికంగా వర్ధంతి వేడుకలు ప్రారంభించారు. మూడేళ్ల పాటు ఆర్భాటంగా జోడేఘాట్‌లోనే భీమ్ వర్ధంతి, దర్బార్ విజయవంతంగా కొనసాగించారు. తదనంతరం మావోయిస్టుల ప్రభావంతో జోడేఘాట్‌లో నిర్వహించే వేడుకలకు ఆటంకం కలిగింది.
కాగా.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమాలు ని ర్వహిస్తూ.. ఇక ప్రత్యేకంగా దర్బార్ అవసరం లేదం టూ అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి పోర ట వీరుడి వర్ధంతిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. కేవలం భీమ్ వారసులే జోడేఘాట్‌కు వెళ్లి ఆదివాసీల సంప్రదాయ పద్ధతిలో సంస్మరణ సభ కొనసాగించారు.
భద్రతా బూచీతో జోడేఘాట్‌కు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఎవరూ రావడం లేదు. ఏటా పలువురు వస్తున్నా పోలీ సులు వారిని హట్టి వద్దే అడ్డుకుంటున్నారు. దీంతో ఎంతో ఆర్భాటంగా జరగాల్సిన వేడుకలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం భీమ్ వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినా.. భద్రతా కారణాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు హట్టికే పరిమితమయ్యారు.
ముస్తాబవుతున్న జోడేఘాట్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటిసారి నిర్వహించే భీమ్ 74వ వర్ధంతి వేడుకలకు జోడేఘాట్ ముస్తాబవుతోంది. ఈ నెల 8న జరగనున్న వర్ధంతి వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నారు. జోడేఘాట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు రావాలని అధికారులను ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం వారం రోజులుగా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖుల తాకిడితో ఈ ప్రాంతం కొత్తరూపు సంతరించుకుంది.
ఇటీవల భీమ్ మనువడు సోనేరావు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి వర్ధంతికి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన జోడేఘాట్‌కు వస్తున్నారు. కాగా.. 2007లో వర్ధంతికి హాజరైన కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లోని 200 ఎకరాల్లో రూ.వంద కోట్లతో బొటానికల్ పార్కు, మూడెకరాల స్థలంలో మ్యూజియం, భీమ్ నిలువెత్తు కాంస్య విగ్రహంతో పాటు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆదివాసీల్లో ఆనందం..
జోడేఘాట్ పోరుగడ్డపైనే వర్ధంతి వేడుకలను జరపాలనే అధికారుల నిర్ణయంతో ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను జోడేఘాట్‌లోనే పరిష్కరించుకుందామనే ధీమాలో కనిపిస్తున్నారు. ఇందుకోసం ఆయా సంఘాల నేతలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలను జోడేఘాట్‌కు పెద్దఎత్తున తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి ఆదివాసీలను తీసుకొచ్చేం దుకు గిరిజన సంఘాలు కార్యాచరణ పూర్తిచేశాయి. ప్రభుత్వ పరంగా తమ ఆరాధ్య దైవమైన కొమురం భీమ్‌కు ఈ సారి నివాళులర్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలి వస్తుండడంతో ఇక జోడేఘాట్ పూర్వవైభవం సంతరించుకోనుంది.
జోడేఘాట్‌లోనే జోహార్లు
Published Tue, Oct 7 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement