భారతదేశంలో కులవిద్వేషాలు, మత ఘర్షణలు తరచు జరుగుతాయని, వివిధ సామాజిక వర్గాల మధ్య సామరస్యం తక్కువని పాశ్చాత్య దేశాల మేధావులు, పాత్రికేయులు ఎప్పటి నుంచో వ్యాఖ్యానించడం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో అప్పుడప్పుడు మతవిద్వేషాలు, కొన్ని ప్రాంతాల్లో కులాల మధ్య కుమ్ములాటలు నిజమే!. కాని ఐరోపా దేశాలు ఇందుకు మినహాయింపు కాదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి.
గతంలో అంటే 2001 సెప్టెంబర్ 11న అల్ కాయిదా అనే ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థ న్యూయార్క్ నగరంలోని ట్విన్ టవర్స్ పై వైమానిక దాడి చేసి, వాటిని కూల్చేసింది. ఇంకా అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటాగాన్ భవనాలపై కూడా అదే సమయంలో దాడికి ప్రయత్నించింది. అమెరికా డొమెస్టిక్ విమానాలను దారి మళ్లించి, వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఢీకొట్టిన అల్ కాయిదా యువకులు ఎక్కువ మంది అరబ్బులు కావడంతో అమెరికాలో అరబ్బులపైన, అరబ్బుల మాదిరిగా కనిపించే ఇరానియన్లు, సిక్కులు సహా ఉత్తరాది భారతీయులపైనా జనం కొందరు దాడులు చేసి గాయపరిచారు. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పరిగణించే అమెరికాలో కూడా ఇండియాతో పోల్చితే జాతి విద్వేషాల ఫలితంగా చెలరేగే హింస ఎక్కువే.
ఇటీవల పాలస్తీనా స్వయం ప్రతిపత్తి, గాజాలోని పాలస్తీనా అరబ్బుల దుర్భర జీవన పరిస్థితులు అనే అంశాల కారణంగా గాజా స్ట్రిప్‌లోని హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్ల వర్షం కురిపించింది. తర్వాత ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) గాజా స్ట్రిప్ పై ప్రతీకార దాడులు జరపడంతో మొత్తం మీద దాదాపు నాలుగు వేల మందకి పైగా మరణించారు. యూదులు నివసించే ప్రాంతాలపై హమాస్ దాడులు, వందకు పైగా ఇజ్రాయెలీ యూదులను కిడ్నాప్ చేసి గాజా ప్రాంతంలోకి తీసుకుపోవడం వంటి ఘటనల గురించి తెలిశాక ఐరోపా దేశాలు, అమెరికాలోని స్థానిక యూదులపై దాడులు పెరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇజ్రాయెల్‌లో కన్నా అమెరికాలోనే యూదులు ఎక్కువ, యూదు వ్యతిరేకతా ఎక్కువే!
ఇజ్రాయెల్ లోని 71 లక్షల మందితో సహా ప్రపంచవ్యాప్తంగా కోటీ 40 లక్షల మంది యూదులున్నారు. ఒక్క అమెరికాలోనే ఇజ్రాయెల్ కన్నా ఎక్కువగా అంటే 76 లక్షల మంది యూదులున్నారు. జుడాయిజం అనే మతం, యూదు జాతి సమ్మిళితమై ఉండే ఈ యూదులు ఎక్కడున్నా మిగిలిన వారితో పోల్చితే సంపన్నులు. వారిలో అపర కుబేరులు, మేధావులు, శాస్త్రవేత్తలు ఎక్కువ. ఈ కారణంగా సహజంగానే పాశ్చాత్య ప్రపంచంలో యూదులపై దాడులు తరచు జరుగుతూనే ఉంటాయి. దీన్నే ఇంగ్లిష్ లో యాంటీ సెమిటిజం అంటారు.
దాదాపు వందేళ్ల క్రితమే జర్మనీలోని స్థానిక జర్మన్లలో అక్కడ తరతరాలుగా జీవిస్తున్న యూదులపై అసూయాద్వేషాలుండేవి. దీన్ని ఆసరా చేసుకుని నియంత అడాల్ఫ్ హిట్లర్ లక్షలాది మంది జ్యూస్ ను అక్కడ ఊచకోతకోయించాడు. వారి కోసం ప్రస్తుత ఇజ్రాయెల్–పాలస్తీనా ప్రాంతంలో ప్రత్యేక దేశం 1948 మేలో ఏర్పాటు చేశారు, తర్వాత యూదు వ్యతిరేకత తగ్గింది గాని, ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో చారిత్రకంగా పరిస్థితుల కారణంగా ముస్లింలంటే కాస్త వ్యతిరేకత, అనుమానాలు ఉన్నట్టే–అమెరికా, ఐరోపా దేశాల్లో కూడా యూదు వ్యతిరేకతతో ఈ జాతివారిపై దాడులు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి.
ప్రపంచంలోగాని, కొన్ని దేశాల్లోగాని కొన్ని మతాలు లేదా జాతుల ప్రజల మధ్య విద్వేషాలు పూర్తిగా సమసిపోవడానికి సమయం పడుతుంది. ఈలోగా హింసాత్మక దాడులు జరగకుండా, ప్రభుత్వాలు, పౌర సమాజంలోని సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. ఈ నెల ఆరంభంలో యూదుల సంగీతోత్సవం సుక్కూత్ ముగిసిన శనివారం ఇజ్రాయెల్ ప్రాంతాలపై హమాస్ దాడి చేసింది. ఈ దాడుల తర్వాత ఐరోపా ఖండంలో యూదులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో యూదు జాతివారిపై దాడులు ఎక్కువయ్యాయని వార్తలొస్తున్నాయి. అదీగాక గత పాతికేళ్లుగా పశ్చిమాసియా దేశాల రాజకీయ సంక్షోభం ఫలితంగా ఈ పారిశ్రామిక ఐరోపా దేశాల్లోకి ముస్లిం అరబ్బులు పెద్ద సంఖ్యలో వచ్చి స్థిరపడడం పెరుగుతోంది.
క్రైస్తవ సమాజంలో యూదులపై తరతరాలుగా ఉన్న అనుమానాలు, వలసవచ్చి స్థిరపడిన ముస్లిం అరబ్బుల్లో ఉన్న యూదు విద్వేషాల కారణంగా ఇప్పుడు ఇంగ్లండ్, స్పెయిన్, పోర్చగల్, జర్మనీ, ఫ్రాన్స్‌లో యూదులపై దాడులు ఎక్కువయ్యాయి. వెంటనే ఈ దాడులు నిలిపివేయడానికి అక్కడి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ప్రపంచీకరణ ఫలితంగా అన్ని జాతులు, మతాలు, దేశాల ప్రజలు అన్ని దేశాలకు ఉపాధి కోసం వెళ్ళి స్థిరపడుతున్న కారణంగా హమాస్ దాడి వంటి సంఘటనలు జరిగినప్పుడు పైన చెప్పిన విద్వేషాలు తాజాగా రగులుకోవడం సర్వసాధారణమైపోయింది. వాటిని నియంత్రించడమే తక్షణ కర్తవ్యంగా అందరూ భావించాలి.
:::విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment