ద్రవ్య బిల్లుగా చూడకండి
* రాజ్యసభలో తొలి ప్రసంగం చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
* ప్రైవేట్ బిల్లుపై ఓటింగ్‌కు అనుమతించాలి
* అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయాలి
* ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైఎస్ జగన్ పోరాడుతూనే ఉంటారు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా చూడొద్దని, దీనిపై ఓటింగ్‌కు అనుమతించాలని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో తొలిసారిగా ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు.
కేంద్రం న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన అనేది జరిగిపోయిన వాస్తవం. ఏపీకి అన్యాయం జరిగిందనడం కూడా అంతే వాస్తవం. నేను కొన్ని చట్టపరమైన విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఆర్థిక మంత్రి రెండు రోజుల క్రితమే ఒక అభిప్రాయం చెప్పారు. ఏపీ సవరణ బిల్లుకు యోగ్యత లేదని, ద్రవ్యబిల్లు అని చెప్పారు. విభజన బిల్లు పాసయినప్పుడు ఆర్టికల్ 3, 4 ద్వారా అమలు చేశారు. ఇప్పుడు దీనిని ద్రవ్య బిల్లు అని, ఆర్టికల్ 109 అని చెప్పడం, స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది.
విభజన చట్టం ఆర్టికల్ 3, 4 పరిధిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆర్టికల్ 109లోకి ఎలా వస్తుంది? రాజకీయ కారణాలతో అధికార పక్షం దీనిని ద్రవ్య బిల్లు అని చెబుతుండవచ్చు. కానీ లీగల్‌గా చూస్తే ద్రవ్యబిల్లు అనలేం. ఒకవేళ చట్టానికి సవరణలు అవసరమైనా ఆర్టికల్ 3, 4 ద్వారా చేయాలి. 75 శాతం బిల్లులు దాదాపు ద్రవ్యబిల్లులే. ఈ బిల్లును అనుమతించకపోతే రాజ్యాంగంలో రెండు సభలు ఉండాలన్న స్ఫూర్తి దెబ్బతింటుంది. ద్రవ్య బిల్లుగా చూడకండి. ఓటింగ్‌కు అనుమతించండి’’ అని కోరారు.
‘హోదా’ తప్పనిసరిగా సంజీవనే
‘‘రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి స్వయంగా కొన్ని హామీలు ఇచ్చారు. 6 అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదన్నారు, పదేళ్లు కావాలన్నారు. చట్టానికి భాష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు బిల్లు చట్టం రూపం దాల్చినప్పుడు ప్రధాన మంత్రి, మంత్రులు చేసిన ప్రసంగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం నిరంతరం కొనసాగుతున్నప్పుడు.. నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పుడు తూచా తప్పకుండా అమలు చేయాలి. ఒకవేళ ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే.. అది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందేమో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బీజేపీ, టీడీపీ తమ ఎన్నికల ప్రణాళికలో రాష్ట్రానికి పది నుంచి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వర్తింపజేస్తామని హామీ ఇచ్చాయి. ఎన్నికలకు ముందు ఎన్డీయే ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటున్నారు. అది తప్పనిసరిగా సంజీవనే. ఆంధ్రప్రదేశ్‌కు జీవరేఖ అవుతుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. హోదా రాకుంటే ఇంకా పోరాడుతారు. వచ్చేంతవరకూ పోరాడుతూనే ఉంటారు’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.