వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులకు బీ–ఫారాలు అందించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. అసెంబ్లీలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం. విజయరాజుకి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి, ఉప కార్యదర్శి వనితారాణి, అభ్యర్థుల తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌పీపీ నేత వి. విజయసాయిరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
3 స్థానాల్లో విజయం సాధిస్తాం: వైవీ
శాసనసభలో అత్యధిక సంఖ్యా బలం మాకే ఉంది. వైఎస్సార్‌సీపీ నుంచి ముగ్గురం విజయం సాధిస్తాం. సీఎం వైఎస్ జగన్ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కి ధన్యవాదాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్‌సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. గతంలో బీసీలు నలుగురికి అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశమిచ్చారు. చరిత్రలో ఎప్పుడులేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని పార్లమెంట్ మెట్లు ఎక్కిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలన్న, సంక్షేమ–అభివృద్ధి పథకాలు అందాలన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలి.
వైఎస్సార్‌సీపీ ఆశయ సాధనకు పనిచేస్తాం : మేడా రఘునాథరెడ్డి
అన్నా.. నువ్వు పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టి ముఖ్యమంత్రి జగన్ నాకు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి త్వం కేటాయించారు. వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ని. నేను దేశవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ, ఇలాంటి మనస్సున్న సీఎంను ఎక్కడా చూడలేదు. ఒకరికి మేలుచేసే విషయంలోనూ, గౌరవించే విషయంలోను ముఖ్యమంత్రి జగన్ తర్వాతే ఎవరైనా. ఎంతో పోటీ ఉన్నా నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి పిలిచి మరీ నాకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా, వైఎస్సార్‌సీపీ ఆశయాల సాధనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మేడా సోదరులం కలిసి పనిచేస్తాం.
పేదలను జగన్ రాజ్యసభకు పంపిస్తున్నారు: గొల్ల బాబురావు
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్న రోజులివి. ఈ కాలంలో మానవీయాన్ని ఒంటినిండా నింపుకున్న ఏకైక రాజకీయ నేతగా ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే కన్పింస్తారు. కష్టకాలంలో సీఎం జగన్ వెంట నడిచాను. ఎవరు మన వారు.. ఎవరు పరాయి వారు అనేది ఆయనకు తెలుసు. నమ్మిన వారిని గుండెల్లో పెట్టుకునే కుటుంబం వైఎస్సార్‌ది. చంద్రబాబు పార్టీలో దళితులకు రాజ్యసభ సీటు అందని ద్రాక్షే. అదే ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి పదవులైనా అన్ని వర్గాలకు సమంగా పంచుతారు. పేద వర్గాలను ఆయన రాజ్యసభకి పంపిస్తున్నారు. వైఎస్సార్ కుటుంబ రుణం తీర్చుకోలేనిది. సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం.
బీ–ఫారాలు అందజేసిన సీఎం జగన్
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. వారికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీ–ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment