
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. మంగళవారం(డిసెంబర్17) లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలోని తమ పార్టీ ఎంపీలందరికి బీజేపీ విప్ జారీ చేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను లోక్‌సభలో సోమవారమే ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, తర్వాత బిజినెస్ నుంచి తొలగించారు.
ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టేందుకు లైన్ క్లియరైంది. దీంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టగానే చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి రిఫర్ చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపట్టే అవకాశం ఉంది. దీంతో స్పీకర్ జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
జమిలి ఎన్నికల బిల్లు గనుక పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితే లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఉభయసభల్లోని మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర క్యాబినెట్ గతంలోనే ఆమోదించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే
Comments
Please login to add a commentAdd a comment