గాయపడ్డ ఎఫ్‌ఆర్వో వాహబ్ అహ్మద్
ఇచ్చోడ(బోథ్): కలప స్మగ్లర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. విలువైన అటవీ సంపదను తరలించుకుపోతున్నారు. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులపై తరచూ దాడులకు దిగుతున్నారు. అయినా స్మగ్లర్ల నుంచి దాడుల నియంత్రణకు అధికార యంత్రాంగం శాశ్వతచర్యలు తీసుకోవడంలో విఫలం అవుతోంది. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న అక్రమ కలప రవాణాను అటవీశాఖ అడ్డుకునే చర్యలు తీసుకుంటున్నా కలప స్మగ్లర్లు బరితెగించి దాడులు నిర్వహిస్తూ అటవీసంపదను తరలించుకుపోతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం ఇచ్చోడ మండలంలో ఎండ్ల బండ్లతో కలపను రవాణా చేస్తుండగా ఇచ్చోడ టైగర్‌జోన్ అధికారులు అడ్డుకున్న సంఘటనలో అటవీ అధికారులపై దాడి చేసి కలపను బలవంతంగా తీసుకెళ్లారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న కలప అక్రమరవాణా అడ్డూఅదుపు లేకుండా జరుగుతోంది. 2016 సంవత్సరంలో అక్రమంగా కలప స్మగ్లింగ్ చేస్తున్న సమాచారం మేరకు అటవీ అధికారులు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చించోలి వద్ద అధికారుల జీపును కల్వర్టులోకి తోసివేసి ధ్వంసం చేశారు. 2015 సంవత్సరంలో బజార్‌హత్నూర్ మండలంలోని డెడ్రా వద్ద పెద్ద్దఎత్తున్న కలప స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడి ప్రాంతానికి వెళ్లగా స్మగ్లర్లు మూకుమ్మడి దాడులకు దిగారు.
ఈ దాడుల్లో అప్పటి ఎఫ్‌ఆర్వోతోపాటు పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఇచ్చోడ మండలం నేరడిగొండ మండలం సరిహద్దులో కుప్టి వంతెన వద్ద స్మగ్లర్లు లారీలో అక్రమంగా కలప తరలిస్తుండగా అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి చేసిన సంఘటనలో పలువురు అధికారులకు గాయాలు అయ్యాయి. అక్రమంగా కలప రవాణా చేసే స్మగ్లర్లకు అడ్డు వస్తున్న అటవీశాఖ అధికారులపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇప్పటికైనా కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపి అక్రమంగా కలప తరలిచిపోకుండా చర్యలు తీసుకోని అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment