సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా అటవీ శాఖ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి డివిజన్లున్నాయి. వీటి పరిధిలో నిజామాబా ద్, కమ్మర్‌పల్లి, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇందల్వాయి రెంజ్‌లున్నాయి. జిల్లావ్యాప్తంగా 140 సా మిల్లులు పనిచేస్తుండగా.. ఇందులో టేకు కలపకు సంబంధించిన సామిల్లులు 60 వరకు ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా 40కిపైగా టేకు కలప సా మిల్లులున్నట్లు తెలుస్తోంది. ఏటా డిసెంబర్‌లో సామిల్లులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తవాటికీ ఇదే సమయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రతి పనికో రేటు
కొత్తగా సామిల్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేవారికి అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు చుక్క లు చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సామిల్లు అనుమతి కోసం రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే సవాలక్ష కొర్రీలతో అడ్డుకుంటున్నట్లు సమాచారం. రెన్యువల్ కోసం ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
‘బీట్’లోనూ..
బీట్ అధికారులు కూడా తక్కువ తినడం లేదన్న ఆరోపణలున్నాయి. కలపతో అక్రమ వ్యాపారం చేస్తున్న సామిల్లు యాజమానుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క సామిల్లు యాజమాని వద్ద నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు నొక్కేస్తున్నట్లు సమాచారం.
కలప స్మగ్లర్లతో సంబంధాలు
కలప అక్రమ రవాణా చేసే స్మగ్లర్లతోనూ పలువురు సిబ్బంది సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఐదారు గ్రూపులుగా ఏర్పడిన దళారులు కలప అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, చెన్నూరు, ఇచ్చోడ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్, ఇతరత్రా ప్రదేశాల నుంచి టేకు కలపను అక్రమంగా నిజామాబాద్ తరలిస్తున్నారు.
నిజామాబాద్‌లో తమకు సంబంధమున్న సామిల్లుకు గుట్టు చప్పుడు కాకుండా కలపను పంపి, ఫర్నీచర్ తయారు చేయించి, కొనుగోలుదారులకు, దుకాణాలకు పంపిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అటవీ శాఖలోని పలువురు ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సహాయానికి కృతజ్ఞతగా స్మగ్లర్లు భారీగానే డబ్బులు అందిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు పర్సంటేజీలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
పది రోజుల వ్యవధిలో..
జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే భారీగా కలప పట్టుబడింది.
జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్ ప్రాంతంలో ఒక పాత ఇంటిపై దాడి చేసిన అటవీ శాఖ అధికారులు 22 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం ఎల్లంపేట శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకు దుంగలను పట్టుకున్నారు. మల్కాపూర్ శివారు నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్న టేకుదుంగలను, భీమ్‌గల్‌లోని ఓ సామిల్లులో అక్రమ కలపతో తయారు చేసిన సోఫాసెట్లు, విలువైన ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న చీకటి దందా విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని తెలుస్తోంది.
అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పందించి కలప అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని, ఇంటిదొంగల పని పట్టాలని ప్రజలు కోరుతున్నారు.
‘ఫారెస్టు’లో చీకటి దందా!
Published Sat, Dec 28 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement