జూరాలకు మళ్లీ వరద
వరద ఉధృతి తగ్గడంతో రెండు రోజుల క్రితం మూసివేసిన జూరాల ప్రాజెక్టు గేట్లను డ్యాం అధికారులు సోమవారం మళ్లీ ఎత్తారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తారు.
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. గత రెండురోజులుగా ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో ఉండడంతో క్రస్టుగేట్లను మూసివేసిన విషయం తెలిసిందే. సోమవారం పెరిగిన వరద ఆధారంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పీజేపీ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7.30గంటల వరకు జూరాల నీటిమట్టం 1044 అడుగులు ఉంది.
ప్రాజెక్టు 12 క్రస్టుగేట్ల ద్వారా 1.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటిమట్టం 1613 అడుగులు ఉంది. ఈ ప్రాజెక్టుకు 1.20లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, 20 క్రస్టుగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటిమట్టం 1704 అడుగులు ఉంది. 85,375 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 5 క్రస్టుగేట్ల ద్వారా 1.15లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోని ఆరుయూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.