గేట్లెత్తితేనే కల సాకారమైనట్లా?
Published Fri, Jan 13 2017 12:02 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
- ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్‌ఆర్
- పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హితవు
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
గేట్లెత్తినంత మాఽత్రాన కల సాకారమైనట్లు చంద్రబాబు భావించడం విడ్డూరంగా ఉందని.. ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే విషయం ప్రజలకు తెలియంది కాదని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కోడుమూరు మాజీ శాసనసభ్యుడు మురళీకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను ప్రారంభించి కల నిజమైందనడంలో అర్థం లేదన్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉండేదని, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన తర్వాత రాష్ట్రానికి ఐదో స్థానం లభించిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మిగతా పార్టీలను బ్రేక్‌చేసి, మీ పార్టీని మేక్ చేస్తున్నారా, అవినీతి పునాదిపై రాజధాని కడుతున్నారా అంటూ ‘ఇండియాటుడే’ ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేత అనే గౌరవం కూడా లేకుండా ‘హూ ఈజ్ దట్ ఫెలో’ అనడం చంద్రబాబు సంస్కారానికి నిదర్శనమన్నారు. పట్టుదల, దూరదృష్టికి అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఆయన స్థాపించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కులమతాలకు తావులేదన్నారు.
రైతులతోనే దేశం సుభిక్షం..
ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో ఆ దేశం సిరిసంపదలతో తులతూగుతుందని నమ్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారని పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని, ఏ పనులూ ముందుకు వెళ్లడం లేదన్నారు. 2019లోనూ అధికార దాహం తీర్చుకునేందుకే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గంలో చిచ్చుపెట్టేందుకే జేసీ దివాకర్‌రెడ్డి చేత రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి కుయుక్తులపై ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనివే..
ఒక్క ప్రాజెక్టుకూ శంకుస్థాపన చేయకపోగా వైఎస్ రాజశేఖరరెడ్డి 80, 90 శాతం పూర్తిచేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లిందని నందికొట్కూరు శాసనసభ్యుడు ఐజయ్య అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.120 కోట్లు మంజూరు చేశారని.. ఇందులో 4 పంపుల ద్వారా కేసీకి నీరు అందించాల్సి ఉండగా, చంద్రబాబు రెండింటినే ప్రారంభించారన్నారు. ఈ కారణంగా సాగునీరు 1000 క్యూసెక్కులు అందాల్సిన చోట 500లకే పరిమితమైందన్నారు. ముఖ్యమంత్రికి నిజంగా రాయలసీమపై, జిల్లాపై ప్రేమే ఉంటే సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని సవాల్ చేశారు.
మాటలతో మభ్యపెడుతున్నారు
టీడీపీ పాలనలో మాటలతో మభ్యపెట్టడమే తప్పిస్తే అభివృద్ధి లేదని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. తమ నేత వైఎస్ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. రౌడీ ఎంపీని దగ్గర పెట్టుకొని సంస్కారం లేకుండా మాట్లాడించడం సీఎం హోదాకు తగదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం యాదవ్, మహిళా, మైనారిటీ విభాగాల జిల్లా అధ్యక్షులు శౌరి విజయకుమారి, ఫిరోజ్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు గోపినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement