ఎల్లంపల్లికి జలకళ
-
నాలుగు గేట్లు ఎత్తివేత
-
ముంపు బాధితుల తరలింపు
రామగుండం/వెల్గటూరు : ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తొలిసారిగా జలకళ వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 18 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో అధికారులు బుధవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. 40వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 21, 22, 23, 24 గేట్ల ద్వారా 10,800 క్యూసెక్కుల నీటిని గోదారినదిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తున్న క్రమంలో బ్యాక్‌వాటర్ ముంపు గ్రామాలను ముంచుతోంది. ఇప్పటికే రామగుండం మండలం కుక్కలగూడూర్‌లోకి నీళ్లు వచ్చాయి. వెల్గటూరు మండలం కోటిలింగాల అలుగు ఒర్రె నీటమునిగి రాకపోకలు స్తంభించాయి. గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. చెగ్యాం గ్రామంలోకి నీళ్లు వస్తుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించారు. నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. సదరు కుటుంబాలకు తాత్కాలికంగా పునరావాస కాలనీలోని జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌తోపాటు తాళ్ల కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో వసతి కల్పించారు. వీటిలో సుమారు 30 గదులు ఉండగా గదికి ఐదు కుటుంబాల చొప్పున వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గదిలో ఐదు కుటంబాలు సామాన్లు పెట్టకునే సరికి పూర్తిగా నిండిపోతోంది. ఈ కుటుంబాలకు పది రోజుల వరకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆ తర్వాత వారే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.