yellampally
-
‘ఎల్లంపల్లి’కి తగ్గిన ఇన్‌ఫ్లో
రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో గురువారం భారీగా తగ్గింది. పక్షం రోజులు లక్షల క్యూసెక్కుల్లో వచ్చిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం 36,539 క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్ల ద్వారా 21,095 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 148.00 మీటర్లకు ప్రస్తుతం 147.55 మీటర్లు ఉంది. 20.175 టీఎంసీల నీటికి 18.92 టీఎంసీలు నిల్వ ఉంది. -
30 గంటలు వరద నీటిలోనే..!
-
30 గంటలు వరద నీటిలోనే..!
వరదలో 30 గంటలు చేపల వేటకు వెళ్లి ఎల్లంపల్లి నీటిలో చిక్కుకున్న ఇద్దరు జాలర్లు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన బృందం రామగుండం : చేపలవేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరదనీటిలో చిక్కుకున్నారు. సుమారు 30గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలంగడిపారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గంగపుత్రులు కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్ ఆదివారం ఉదయం చేపల వేట కోసం ప్రాజెక్టు దిగువన గోదావరి నదిలోకి వెళ్లారు. ఎగువన వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు సుమారు 5.25లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయిన జాలర్లు.. ముళ్లచెట్లకు చిక్కుకున్నారు. ఇదేవిషయాన్ని తమ వద్ద ఉన్న మెుబైల్‌ఫోన్ ద్వారా రాజేశ్ అన్న ధర్మాజీ శ్రీనివాస్‌కు సమాచారం చేరవేశాడు. అతడు సాయంత్రం వేళ అధికారులకు అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, జాతీయ విపత్తు సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) తదితర శాఖలు అప్రమత్తమయ్యాయి. గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, సీఐ వాసుదేవరావు, ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎల్లంపల్లి సర్పంచ్ సంకటి సుధాకర్, వైస్ ఎంపీపీ కొదురుపాక పవన్‌తోపాటు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఇన్చార్జి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ ప్రవీణ్, తహసీల్దార్ దండు మధుసూదన్, ఆర్డీవో అయేషామస్రత్ఖాన్, ఆర్ఐ గడియారం శ్రీహరి, ముల్కల్ల సర్పంచ్ నైతిని శంకరమ్మ, ఆదిలాబాద్ జేసీ సుందర్‌అబ్నార్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ కనకేశ్, ఎస్ఈ విజయభాస్కర్ తదితరులు పర్యవేక్షించారు. ఏఎస్సీ విష్ణు ఎస్.వారియర్ స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్, ధర్మాజీ శ్రీనివాస్ కలిసి చేపల వేటకు ప్రాజెక్టు దిగువలోని గోదావరి నదిలో దిగారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో ధర్మాజీ శ్రీనివాస్ సాయంత్రం ఒడ్డుకు చేరి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటలు గడుస్తునా తనతోపాటు నదిలో దిగిన ఇద్దరు ఇంటికి చేరలేదు. దీంతో శ్రీనివాస్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు, బట్టలు అక్కడే ఉండడంతో వరదలోనే చిక్కుకున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. అటునుంచి కేకలతో సమాధానం వచ్చింది. సాయంత్రం 6.30 గంటలకు తన తమ్ముడితోపాటు స్నేహితుడు సంతోష్ వరద నీటిలో చిక్కుకున్నాడని సర్పంచ్ సంకటి సుధాకర్‌కు శ్రీనివాస్ తెలియజేశాడు. సర్పంచ్ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 8గంటలకు ప్రాజెక్టు వద్దకు ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి, గ్రామ పోలీసు అధికారి బాయి శ్రీనివాస్ చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి టార్చిలైట్ల సాయంతో మరోసారి జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి సమాంతరంగా బురద, ముళ్లపొదలు దాటుకుంటూ కొద్దిదూరం వెళ్లారు. తర్వాత కేకలు వేయడంతో.. వరదనీటిలోనే ఉన్నామని నీటిలో చిక్కుకున్న వారి నుంచి సమాధానం వచ్చింది. ‘మీకేం భయంలేదు.. జాగ్రత్తగా ఉండండి.. ఏం వరద రాదని’ వారికి ఎస్సై తదితరులు ధైర్యం చెప్పారు. అదే రాత్రి గుడిపేట వైపు జాలర్లను పిలిపించి వారు చిక్కుకున్న ప్రదేశాన్ని చూపించి ఒడ్డుకు చేర్చేందుకు చేపట్టాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చారు. చివరగా అర్ధరాత్రి గం.2.30 (సోమవారం వేకువజాము) హైదరాబాద్‌లోని 10వ బెటాలియంకు చెందిన జాతీయ విపత్తుల స్పందన సంస్థ (ఎన్డీఆర్ఎఫ్)కు ఇక్కడి ఘటనను వివరించారు. అధునాతన వస్తుసామగ్రితో ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రత్యేక బస్సులో బయలు దేరి సోమవారం ఉదయం 6 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరారు. ప్రాజెక్టులో వరద పరిస్థితిని గోదావరిఖని ఏఎస్పీతో సమీక్షించారు. గేట్ల వద్ద వరద ఉధృతితోపాటు ఎయిర్‌బోట్స్ దిగేందుకు ప్లాట్‌ఫామ్స్ లేకపోవడం, ఇరువైపులా భారీగా ముళ్లపొదలు ఉండడంతో ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్ వద్ద నుంచి ఆపరేషన్ కుదురుతుందని ఎన్డీఆర్ఎఫ్ బృందం స్పష్టం చేసింది. దీంతో ఉదయం 8.30 గంటలకు ఆదిలాబాద్ జిల్లా ముల్కల్ల వద్ద ఉన్న పుష్కరఘాట్‌కు 22 మందితో కూడిన బృందం చేరుకుంది. వారితో రబ్బర్బోట్, లైట్‌బాయ్, డాట్బ్రాహెల్మోటార్స్, లైట్ జాకెట్స్, లైఫ్లైన్రోప్స్తో ఎన్డీఆర్ఎఫ్ ఎస్సైలు ఘన్పాల్సింగ్, తృశాల్సింగ్తోపాటు 22 మంది బృందం వరద నీటిలో దిగేందుకు రంగం సిద్ధం చేశారు. మూడు రబ్బర్ బోట్స్‌తో మరిన్ని ఆయుధాలను సిద్ధం చేసుకొని మూడు బృందాలుగా విడిపోయి ఉదయం 11.30గటలకు ప్రాజెక్టు వరద నీటిలోకి మొదటి బోటులో ఐదుగురు బృందంతో దిగారు. దాని తర్వాత పది నిమిషాల వ్యవధిలోనే రెండో బోటు దిగి వెళ్తుున్న క్రమంలో వరద ఉధృతితో వెనుకకు కొట్టుకు వచ్చింది. దీంతో మొదటి బోటుతోనే ఆపరేషన్ చేపట్టారు. వరద ఉధృతికి బోటు పది మీటర్లు ముందుకు వెళ్తే.. ఇరవై మీటర్లు వెనక్కి వచ్చింది. అయినా వెనక్కి తగ్గని బృందం.. జాలర్లు చిక్కుకున్న ప్రదేశానికి వంద మీటర్ల దూరానికి చేరింది. బోటును చూస్తుండగా అందరి ముఖాల్లో సంతోషం.. క్రమంగా ఉత్కంఠకు తెరతీసింది. పెరుగుతున్న వరద ఉధృతితో సుమారు ఐదు వందల మీటర్ల దూరానికి బోటు పక్కకు కొట్టుకుపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై కొట్టుకుపోతున్న బోటుకు ఎదురుగా ఉన్న రెండు గేట్లను మూసివేశారు. దీంతో బోటు ముందుకు సాగిపోయింది. ప్రయాణం సాఫీగా సాగి నీటిలో చిక్కుకున్న జాలర్ల వద్దకు చేరుకున్న సహాయ బృందం.. ఇద్దరు జాలర్లను బోటులోకి ఎక్కించుకొని మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుగు ప్రయాణమైంది. ఇరవై నిమిషాల్లో ముల్కల్ల ఘాట్‌కు సురక్షితంగా చేరుకుంది. అప్పటికే సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది.. జాలర్లకు అత్యవసర వైద్య సేవలు అందించారు. బీపీ, ఇతరత్రా పరీక్షలు జరిపారు. తక్షణమే అంబులెన్స్ ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆదిలాబాద్ జేసీ సుందర్ అబ్నార్ ముల్కల్ల ఘాట్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఎన్డీఆర్ఎఫ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. గోదావరిఖని ఏఎస్పీ, బెల్లంపల్లి డీఎస్పీ, మంచిర్యాల ఆర్డీవో తదితరులు ఎన్డీఆర్ఎఫ్ సేవలను ప్రశంసించారు. బెటాలియన్ ఎస్సైలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం వరద నీటిలో గాలిస్తున్నంత సేపు ముల్కల్ల ఘాట్‌తోపాటు ఎల్లంపల్లి బ్యారేజీపై ఉన్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు బోట్లో ఉన్న వారితో ఎప్పటికప్పుడు వాకీటాకీలతో పరిస్థితిని తెలుసుకుంటూ ముందుకు సాగడం అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించింది. -
ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలి
మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్: జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇళ్లు కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలను మానవతాద క్పథంతో ఆదుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల పునరావాస కాలనీల మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మొత్తం భూములు కోల్పోయి ఇళ్లు మాత్రమే మిగిలిన వారికి తగిన న్యాయం చేయాలని సూచించారు. ముంపు గ్రామాల ప్రజలకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టులో సమస్యలుంటే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలకు 15 రోజులు గడువు ఇచ్చి పునరావాస కాలనీలకు తరలించాలని సూచించారు. చెగ్యాం గ్రామంలో 34 ఇళ్ల సమస్య ఉందని, వారికి రీసర్వే ప్రకారం పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, పెద్దపల్లి, కరీంనగర్ ఆర్డీవోలు పి.అశోక్‌కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తరలివచ్చిన ముంపు గ్రామాల ప్రజలు ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని చెగ్యాం, ముక్కట్రావుపేట, పాశిగాం, కోటిలింగాల ముంపు గ్రామాల ప్రజలు మంగళవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జేసీ శ్రీదేవసేన, జిల్లా అధికారులు నిర్వాసితులతో సమీక్ష నిర్వహించారు. ముంపు గ్రామాలకు చెందిన పలువురు బాధితులు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించడంలో అన్యాయం జరిగిందని, పరిహారాన్ని పెంచి ఇవ్వాలని కోరారు. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకుని ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకపోతుందని, అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్దామని, అందుకయ్యే ఖర్చులను సైతం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. -
మునిగిన భూములు
అందని పరిహారం పట్టించుకోని భూసేకరణ అధికారులు అధికారి తప్పిదం..రైతులకు శిక్ష ఎనిమిదేళ్లుగా జాడలేని రీసర్వే వెల్గటూరు : పరిహారం అందకుండానే వ్యవసాయభూములు నీట మునిగాయి. కొన్ని భూములు మునకుండా కనిపిస్తున్నా చుట్టూ నీరు చేరడంతో వెళ్లేందుకు దారి లేదు. దీంతో సాగు చేసుకోలేక, పరిహారం రాక మండలంలోని కోటిలింగాల, ముక్కట్రావుపేట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క అధికారి తప్పిదంతో దాదాపు 31 మంది రైతులు అయోమయంలో పడ్డారు. రీసర్వే చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిహార ం అందక, సాగు చేసుకోలేక దిక్కులు చూస్తున్నారు. చిన్న పొరపాటు మండలంలోని వెల్గటూరు, ముక్కట్రావుపేట, పాషిగాం కోటిలింగాల గ్రామాలకు చెందిన రైతుల భూములు వెల్గటూరు, ముక్కట్రావుపేట శివారులో ఉన్నాయి. వెల్గటూరు శివారులో సుమారుగా 25 ఎకరాల వరకు పట్టా భూములు ఉన్నాయి. ఈపట్టా భూములను ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సర్వేయర్ రామాచారి కొలతలు వేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూముల్లో నుంచి కోటిలింగాలకు వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు పోయిన ప్రభుత్వ భూమిని తీసి వేయకుండానే సర్వే చేసి పంపారు. తప్పు గమనించిన ఉన్నతాధికారులు పరిహారం చెల్లించకుండా ఫైల్ నిలిపేశారు. తిరిగి సర్వే చేసి పంపించాల్సిన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి దీని గురించి పట్టించుకున్న వారు లేరు. ఫలితంగా రైతులు దిక్కులు చూస్తున్నారు. పెద్దవాగు తీరం వెంబడి 31 మంది రైతులకు సుమారు 31 ఎకరాల పరంపోగు భూమి ఉంది. వీటిని ఇప్పటికీ అధికారులు సర్వే చేయలేదు. ఈ భూములు ప్రస్తుతం జలగర్భంలో కలిసిపోయాయి. పరిహారం విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఉన్న కొద్దిపాటి భూమి ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో పోయిందని.. తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టూనీరు మధ్యలో భూమి బ్యాక్‌వాటర్ పల్లపు ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయ భూములను ముంచి వేస్తుంది. కోటిలింగాల గ్రామంలో కొన్ని చోట్ల భూమి మునకుండా కనిపిస్తుంది. దీనికి పరిహారం ఇవ్వలేదు. సాగుచేసుకుందామంటే అటు చుట్టూ నీరు చేరింది. ఆ భూమిని కూడా ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించాలని రైతులు రాపాక శ్రీనివాస్, దాసరి పోచయ్య కోరుతున్నారు. రెండెకరాలు మునిగింది నాకున్న రెండెకరాలు నీటిలో మునిగిపోయింది. పైసలు రాలేదు. అధికారులు రెండుసార్లు వచ్చి సర్వే చేసిండ్రు. మా బాధను ఎవరికీ చెప్పినా పట్టించుకుంటలేరు. – తిరుపతి, వెల్గటూరు -
ఇదేం.. న్యాయం..
చెగ్యాంలో కలెక్టర్‌ను ఘెరావ్ చేసిన నిర్వాసితులు నిర్వాసితులతో సమావేశం సమస్యలు పరిష్కరిస్తామని హామీ వెల్గటూరు : ఎల్లంపెల్లి ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కలెక్టర్ నీతూప్రసాద్‌ను గురువారం ఘెరావ్‌చేశారు. తమకు పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందని ఆమెకు విన్నవించారు. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌తో మండలంలోని చెగ్యాం గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరగా.. నిర్వాసితులను అధికారులు బుధవారం బలవంతంగా పునరావాస కాలనీకి తరలించారు. పునరావాస కేంద్రంలోని వారి బాధలను తెలుసుకోవడానికి గురువారం కలెక్టర్ నీతూప్రసాద్ చెగ్యాం రాగా.. గ్రామ శివారులోనే నిర్వాసితులు ఆమెను అడ్డుకున్నారు. ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న తమకు పరిహారం చెల్లింపులో అధికారులు అన్యాయం చేశారని కలెక్టర్‌కు విన్నవించారు. న్యాయమైన పరిహారం చెల్లించే దాకా గ్రామంలోనుంచి వెళ్లమంటే పోలీసులు దౌర్జన్యంగా గెంటేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండానే తమను పంపించేయడం న్యాయమేనా? అని కలెక్టర్‌ను ప్రశ్నించి రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. న్యాయం చేసే వరకు కదలమని మహిళలు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ రోడ్డుకు అడ్డంగా కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. బాధలు తెలుసుకునేందుకు తాను వచ్చానని చెప్పారు. అనంతరం ఆర్అండ్ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న కుటుంబాలతో మాట్లాడారు. వారికి భోజన, ఇతర వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. అర్హులకు న్యాయం చేస్తాం.. 34 ఇళ్లకు పరిహారం తక్కువగా వచ్చిందని నిర్వాసిత కుటుంబాలు కలెక్టర్, జేసీ దేవసేన దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని గంటపాటు బాధితుల సమస్యలను వారు ఓపికగా విన్నారు. గ్రామంలో 132 మంది పరిహారం తీసుకున్నారని, మరో 34 మందికి రావాల్సి ఉందని కలెక్టర్ వివరించారు. ఒకసారి అధికారులు అవార్డు చేసిన తర్వాత దానిని మార్చడం సాధ్యం కాదని చెప్పారు. స్థానిక నాయకులు తమను మభ్యపెట్టి పరిహారం నమోదులో అన్యాయం చేశారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేశారు. అవార్డు చేయని ఇల్లు, కూలీ వేతనాలు రాని అర్హత గల యువకులు ఉంటే పరిశీలించి వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీవో అశోక్‌కుమార్‌కు సూచించారు. సమావేశం ముగించుకుని తిరిగి వెళ్తున్న కలెక్టర్, జేసీని నిర్వాసితులు ఘెరావ్ చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఆర్డీవో అశోక్ కుమార్, ప్రత్యేకాధికారి ఇంద్రసేనారెడ్డి, ఈవోపీఆర్డీ రాజేశ్వరీ, తహశీల్దార్ కృష్ణవేణి, ఎస్సై అంజయ్య రవూఫ్, ఏపీవో చంద్రశేఖర్, ఏపీఎం చంద్రకళ పాల్గొన్నారు. కోటిలింగాల నిర్వాసితులు పునరావాస కేంద్రానికి వెళ్లాలి వెల్గటూరు: ఎల్లంపెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కోటిలింగాలవాసులు తక్షణమే పునరావాసకేంద్రానికి తరలివెళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారు. వెల్గటూరు– కోటిలింగాలను కలిపే లోలెవల్ వంతెన మునిగిపోగా.. కలెక్టర్ దాన్ని పరిశీలించారు. వంతెన పైనుంచి వరద నీటిలో జనం దాటుతున్న తీరును చూసి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుచేయాలని పంచాయతీరాజ్ ఎస్ఈ దశరథంకు సూచించారు. అనంతరం కోటిలింగాల కోసం ఏర్పాటుచేసిన పునరావాసకాలనీని సందర్శించారు. తక్షణమే నిర్వాసితులు ఇక్కడికి తరలివచ్చి ఇళ్లు నిర్మించు కోవాలని ఆదేశించారు. ఆర్డీవో అశోక్‌కుమార్, డీఈ రవికుమార్, ఏఈ చలపతి, సర్పంచ్ గాజులసతీశ్,ఎంపీటీసీ పత్తిపాక వెంకటేశ్, ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీవో పురుషోత్తంరావు పాల్గొన్నారు. -
ఎల్లంపల్లికి జలకళ
నాలుగు గేట్లు ఎత్తివేత ముంపు బాధితుల తరలింపు రామగుండం/వెల్గటూరు : ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తొలిసారిగా జలకళ వచ్చింది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 18 టీఎంసీలకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉండటంతో అధికారులు బుధవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. 40వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో 21, 22, 23, 24 గేట్ల ద్వారా 10,800 క్యూసెక్కుల నీటిని గోదారినదిలోకి వదులుతున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్, ప్రాజెక్టు సూపరింటెండెంట్ విజయ్‌భాస్కర్ తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేస్తున్న క్రమంలో బ్యాక్‌వాటర్ ముంపు గ్రామాలను ముంచుతోంది. ఇప్పటికే రామగుండం మండలం కుక్కలగూడూర్లోకి నీళ్లు వచ్చాయి. వెల్గటూరు మండలం కోటిలింగాల అలుగు ఒర్రె నీటమునిగి రాకపోకలు స్తంభించాయి. గ్రామంలోకి నీళ్లు చేరుతున్నాయి. చెగ్యాం గ్రామంలోకి నీళ్లు వస్తుండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించారు. నిర్వాసితులను పునరావాస కాలనీకి తరలించారు. సదరు కుటుంబాలకు తాత్కాలికంగా పునరావాస కాలనీలోని జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్‌తోపాటు తాళ్ల కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో వసతి కల్పించారు. వీటిలో సుమారు 30 గదులు ఉండగా గదికి ఐదు కుటుంబాల చొప్పున వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఒక గదిలో ఐదు కుటంబాలు సామాన్లు పెట్టకునే సరికి పూర్తిగా నిండిపోతోంది. ఈ కుటుంబాలకు పది రోజుల వరకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, ఆ తర్వాత వారే తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.