బ్యాక్ వాటర్‌లో మునిగిన వ్యవసాయ భూములు
-
అందని పరిహారం
-
పట్టించుకోని భూసేకరణ అధికారులు
-
అధికారి తప్పిదం..రైతులకు శిక్ష
-
ఎనిమిదేళ్లుగా జాడలేని రీసర్వే
వెల్గటూరు : పరిహారం అందకుండానే వ్యవసాయభూములు నీట మునిగాయి. కొన్ని భూములు మునకుండా కనిపిస్తున్నా చుట్టూ నీరు చేరడంతో వెళ్లేందుకు దారి లేదు. దీంతో సాగు చేసుకోలేక, పరిహారం రాక మండలంలోని కోటిలింగాల, ముక్కట్రావుపేట రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క అధికారి తప్పిదంతో దాదాపు 31 మంది రైతులు అయోమయంలో పడ్డారు. రీసర్వే చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో పరిహార ం అందక, సాగు చేసుకోలేక దిక్కులు చూస్తున్నారు.
చిన్న పొరపాటు
మండలంలోని వెల్గటూరు, ముక్కట్రావుపేట, పాషిగాం కోటిలింగాల గ్రామాలకు చెందిన రైతుల భూములు వెల్గటూరు, ముక్కట్రావుపేట శివారులో ఉన్నాయి. వెల్గటూరు శివారులో సుమారుగా 25 ఎకరాల వరకు పట్టా భూములు ఉన్నాయి. ఈపట్టా భూములను ఎనిమిదేళ్ల క్రితం అప్పటి సర్వేయర్ రామాచారి కొలతలు వేసి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూముల్లో నుంచి కోటిలింగాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు పోయిన ప్రభుత్వ భూమిని తీసి వేయకుండానే సర్వే చేసి పంపారు. తప్పు గమనించిన ఉన్నతాధికారులు పరిహారం చెల్లించకుండా ఫైల్ నిలిపేశారు. తిరిగి సర్వే చేసి పంపించాల్సిన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి దీని గురించి పట్టించుకున్న వారు లేరు. ఫలితంగా రైతులు దిక్కులు చూస్తున్నారు. పెద్దవాగు తీరం వెంబడి 31 మంది రైతులకు సుమారు 31 ఎకరాల పరంపోగు భూమి ఉంది. వీటిని ఇప్పటికీ అధికారులు సర్వే చేయలేదు. ఈ భూములు ప్రస్తుతం జలగర్భంలో కలిసిపోయాయి. పరిహారం విషయమై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఉన్న కొద్దిపాటి భూమి ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో పోయిందని.. తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టూనీరు మధ్యలో భూమి
బ్యాక్‌వాటర్ పల్లపు ప్రాంతాల నుంచి వచ్చి వ్యవసాయ భూములను ముంచి వేస్తుంది. కోటిలింగాల గ్రామంలో కొన్ని చోట్ల భూమి మునకుండా కనిపిస్తుంది. దీనికి పరిహారం ఇవ్వలేదు. సాగుచేసుకుందామంటే అటు చుట్టూ నీరు చేరింది. ఆ భూమిని కూడా ప్రభుత్వం సేకరించి పరిహారం చెల్లించాలని రైతులు రాపాక శ్రీనివాస్, దాసరి పోచయ్య కోరుతున్నారు.
రెండెకరాలు మునిగింది
నాకున్న రెండెకరాలు నీటిలో మునిగిపోయింది. పైసలు రాలేదు. అధికారులు రెండుసార్లు వచ్చి సర్వే చేసిండ్రు. మా బాధను ఎవరికీ చెప్పినా పట్టించుకుంటలేరు.
– తిరుపతి, వెల్గటూరు