చేపలవేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరదనీటిలో చిక్కుకున్నారు. సుమారు 30గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలంగడిపారు. ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గంగపుత్రులు కూనారపు సంతోష్, ధర్మాజీ రాజేశ్ ఆదివారం ఉదయం చేపల వేట కోసం ప్రాజెక్టు దిగువన గోదావరి నదిలోకి వెళ్లారు. ఎగువన వరద ఉధృతి అధికంగా ఉండడంతో అధికారులు సుమారు 5.25లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నీటి ఉధృతికి కొంతదూరం కొట్టుకుపోయిన జాలర్లు.. ముళ్లచెట్లకు చిక్కుకున్నారు. ఇదేవిషయాన్ని తమ వద్ద ఉన్న మెుబైల్‌ఫోన్ ద్వారా రాజేశ్ అన్న ధర్మాజీ శ్రీనివాస్‌కు సమాచారం చేరవేశాడు. అతడు సాయంత్రం వేళ అధికారులకు అందించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, జాతీయ విపత్తు సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) తదితర శాఖలు అప్రమత్తమయ్యాయి.