ఇదేం.. న్యాయం.. | fire on collecter exprents | Sakshi
Sakshi News home page

ఇదేం.. న్యాయం..

Published Thu, Aug 4 2016 9:02 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

ఇదేం.. న్యాయం.. - Sakshi

ఇదేం.. న్యాయం..

  • చెగ్యాంలో కలెక్టర్‌ను ఘెరావ్‌ చేసిన నిర్వాసితులు
  • నిర్వాసితులతో సమావేశం 
  • సమస్యలు పరిష్కరిస్తామని హామీ 
  • వెల్గటూరు : ఎల్లంపెల్లి ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కలెక్టర్‌ నీతూప్రసాద్‌ను గురువారం ఘెరావ్‌చేశారు. తమకు పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందని ఆమెకు విన్నవించారు. ఎల్లంపల్లి  బ్యాక్‌వాటర్‌తో మండలంలోని చెగ్యాం గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరగా.. నిర్వాసితులను అధికారులు బుధవారం బలవంతంగా పునరావాస కాలనీకి తరలించారు. పునరావాస కేంద్రంలోని వారి బాధలను తెలుసుకోవడానికి గురువారం కలెక్టర్‌ నీతూప్రసాద్‌ చెగ్యాం రాగా.. గ్రామ శివారులోనే నిర్వాసితులు ఆమెను అడ్డుకున్నారు. ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్న తమకు పరిహారం చెల్లింపులో అధికారులు అన్యాయం చేశారని కలెక్టర్‌కు విన్నవించారు. న్యాయమైన పరిహారం చెల్లించే దాకా గ్రామంలోనుంచి వెళ్లమంటే పోలీసులు దౌర్జన్యంగా గెంటేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండానే తమను పంపించేయడం న్యాయమేనా? అని కలెక్టర్‌ను ప్రశ్నించి రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. న్యాయం చేసే వరకు కదలమని మహిళలు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్‌ రోడ్డుకు అడ్డంగా కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. బాధలు తెలుసుకునేందుకు తాను వచ్చానని చెప్పారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఉన్న కుటుంబాలతో మాట్లాడారు. వారికి భోజన, ఇతర వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం నిర్వాసితులతో సమావేశమయ్యారు. 
    అర్హులకు న్యాయం చేస్తాం..
    34 ఇళ్లకు పరిహారం తక్కువగా వచ్చిందని నిర్వాసిత కుటుంబాలు కలెక్టర్, జేసీ దేవసేన దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని గంటపాటు బాధితుల సమస్యలను వారు ఓపికగా విన్నారు. గ్రామంలో 132 మంది పరిహారం తీసుకున్నారని, మరో 34 మందికి రావాల్సి ఉందని కలెక్టర్‌ వివరించారు. ఒకసారి అధికారులు అవార్డు చేసిన తర్వాత దానిని మార్చడం సాధ్యం కాదని చెప్పారు. స్థానిక నాయకులు తమను మభ్యపెట్టి పరిహారం నమోదులో అన్యాయం చేశారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేశారు. అవార్డు చేయని ఇల్లు, కూలీ వేతనాలు రాని అర్హత గల యువకులు ఉంటే పరిశీలించి వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్డీవో అశోక్‌కుమార్‌కు సూచించారు. సమావేశం ముగించుకుని తిరిగి వెళ్తున్న కలెక్టర్, జేసీని నిర్వాసితులు ఘెరావ్‌ చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఆర్డీవో అశోక్‌ కుమార్, ప్రత్యేకాధికారి ఇంద్రసేనారెడ్డి, ఈవోపీఆర్డీ రాజేశ్వరీ, తహశీల్దార్‌ కృష్ణవేణి, ఎస్సై అంజయ్య రవూఫ్, ఏపీవో చంద్రశేఖర్, ఏపీఎం చంద్రకళ  పాల్గొన్నారు.
     
    కోటిలింగాల నిర్వాసితులు పునరావాస కేంద్రానికి వెళ్లాలి
     వెల్గటూరు: ఎల్లంపెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కోటిలింగాలవాసులు తక్షణమే పునరావాసకేంద్రానికి తరలివెళ్లాలని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ ఆదేశించారు. వెల్గటూరు– కోటిలింగాలను కలిపే లోలెవల్‌ వంతెన మునిగిపోగా.. కలెక్టర్‌ దాన్ని పరిశీలించారు. వంతెన పైనుంచి వరద నీటిలో జనం దాటుతున్న తీరును చూసి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటుచేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ దశరథంకు సూచించారు. అనంతరం కోటిలింగాల కోసం ఏర్పాటుచేసిన పునరావాసకాలనీని సందర్శించారు. తక్షణమే నిర్వాసితులు ఇక్కడికి తరలివచ్చి ఇళ్లు నిర్మించు కోవాలని ఆదేశించారు. ఆర్డీవో అశోక్‌కుమార్, డీఈ రవికుమార్, ఏఈ చలపతి, సర్పంచ్‌ గాజులసతీశ్,ఎంపీటీసీ పత్తిపాక వెంకటేశ్, ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీవో పురుషోత్తంరావు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement