కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు.
ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు.
ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్ చీఫ్ ఇంజనీర్ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్ ఎం.రాజు, హైడ్రో మెకానికల్ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్‌కుమార్‌శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు.
శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు
భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది.
రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment