అట్లాంటా :
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(జీఏటీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్, తెలంగాణ సాంస్కృతికోత్సవానికి విశేష స్పందన వచ్చింది. అట్లాంటాలో కుమ్మింగ్‌లోని ఫోర్‌సిత్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ, అట్లాంటాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, అట్లాంటా వ్యాపారవేత్తల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి 250మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటూ పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు.
సతీష్ చేటి (జీఏటీఈఎస్ చైర్మన్) అతిథులను ఆహ్వానించగా, ప్రశాంతి అసిరెడ్డి ( జీఏటీఈఎస్ ప్రెసిడెంట్) ముఖ్య అతిథులను సెమినార్కు వచ్చిన వారికి పరిచయం చేశారు. ఆర్ శ్రీనివాసన్(కాన్సుల్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్) , ప్రొఫెసర్ వి.వెంకట రమణ (హెచ్సీయూ), కార్టర్ పాట్టర్సన్లు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. ఎన్ఆర్ఐలు భారత్లో పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వ పాలసీలు అనూకూలంగా ఉన్నాయని ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇలాంటి సెమినార్లు నిర్వహించి ఎన్ఆర్ఐలలో చైతన్యం చేస్తున్నందుకుగానూ జీఏటీఈఎస్ను ఆయన అభినందించారు.
తెలంగాణలో ఐటీ, ఫార్మా పార్క్, టెక్స్టైల్ పార్క్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్మెంట్వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, వనరుల గురించి ప్రొఫెసర్ వి.వెంకట రమణ వివరించారు. అట్లాంటాలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను కార్టర్ తెలిపారు. అమెరికా ఎకానమీ పటిష్టం చేయడంలో ఇండో-అమెరికన్ల కృషిని ఆయన కొనియాడారు. అట్లాంటాలో వ్యాపారరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న తెలంగాణకు చెందిన కిరణ్ పాశం, మిగతా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు.
ప్రజాప్రతినిధులు డన్కన్, బ్రాండన్లను జీఏటీఈఎస్ సత్కరించింది. రమేష్ తన మిమిక్రీతో అతిథులను అలరించారు. బుర్రకథ, ఒగ్గుకథ, సమ్మక్క సారక్క నృత్యరూపకం, పేరిణి డ్యాన్స్, లంబాడీ డ్యాన్స్, జానపద నృత్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకుగానూఈవెంట్ స్పాన్సర్స్ ఇన్ఫోస్మార్ట్, ఈఐఎస్ టెక్నాలజీస్లను జీఏటీఈఎస్ ఈసీ, బోర్డు అభినందించింది.
సతీష్ చేటి, శ్రీనివాస్ గంగసాని, నందా చాట్ల, అనితా నేలుట్ల, కిషన్ తాల్లపల్లి, అనిల్ బోడిరెడ్డి, శ్రీనివాస్ ఆవుల, సునిల్ రెడ్డి కూటూరు, రాహుల్ చిక్యాల, రఘురెడ్డి, వేణు పిసికె, శ్రీధర్ నెలవెల్లి, సునిల్ గూటూరు, సురేష్, కే. వేలమ్, తిరుమల్ పిట్టల సమిష్టి సహకారంతో జీఏటీఈఎస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.