పోలీసులూ షాక్ తిన్నారు! | Beware of women! | Sakshi
Sakshi News home page

పోలీసులూ షాక్ తిన్నారు!

Published Mon, Jan 12 2015 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

పోలీసులూ షాక్ తిన్నారు!

పోలీసులూ షాక్ తిన్నారు!

షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!

 
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు మేము చేస్తున్న ప్రయత్నమిది...
 
హోరున వర్షం. ఆ వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి చేరుకున్నాను. తడిసి ముద్దైన నన్ను చూస్తూనే కంగారుపడ్డాడు నాన్న. ఏంటీ పిచ్చిపని అంటూ నాలుగు చీవాట్లు కూడా వేశాడు. కానీ అవి నన్ను బాధపెట్టలేదు. ఎందుకంటే, అంతకంటే పెద్ద బాధ నా మనసును మెలిపెట్టేస్తోంది. అది తెలియని నాన్న ఆరోగ్యమంటే లెక్కలేదు నీకు అంటూ అరుస్తున్నాడు. ఎలా చెప్పను నాన్నకి... ఆయన కూతురికి జరిగిన అవమానం? చేయని తప్పిదానికి మూటకట్టుకున్న అపమానం? నాకో గొప్ప సంబంధం దొరికినందుకు... కట్నం కోరకుండా, పెళ్లి ఖర్చులకు వెరవకుండా, నన్ను నన్నుగా తీసుకెళ్లడానికి సిద్ధపడిన వ్యక్తి తనకు అల్లుడిగా రాబోతున్నందుకు మురిసిపోతున్నాడు తను. కానీ అదే వ్యక్తి నా శీలాన్ని శంకించాడని, ఛీకొట్టి పొమ్మన్నాడనీ ఎలా చెప్పేది! తన కలల మీద కన్నీళ్లు ఎలా చల్లేది!

ఏదో మాట్లాడాలి రమ్మంటూ కిశోర్ ఫోన్ చేస్తే, ఆఫీసు అవగానే వెళ్లాను. నా గురించి ఎవరో రాసిన తప్పుడు రాతలను మెయిల్‌లో చూపించి, మానమర్యాదలు లేనిదానిగా జమకట్టేశాడు. నా సమాధానం వినలేదు. నా సంజాయిషీ కోరలేదు. నన్ను ముద్దాయిలా నిలదీశాడు. నేరస్థురాలిలా నిలబెట్టేశాడు. పెళ్లి రద్దు చేయడమే నీకు శిక్ష అంటూ తీర్పు చెప్పి వెళ్లిపోయాడు.
 
నా మనసు ముక్కలైపోయింది. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు... ఇలా ఎన్నిసార్లు? ఎన్నోసార్లు! ప్రతిసారీ సంబంధం కుదరడం... వారం తిరిగేలోపు పెళ్లికొడుక్కి ఎవరో నా గురించి తప్పుడు విషయాలు మెయిల్ ద్వారా తెలపడం, అతడు నన్ను కాదనడం, అవమానించి నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం! ఇలా జరిగిన ప్రతిసారీ నాన్న పడుతోన్న వేదనను చూడలేక మనసు విలవిల్లాడుతోంది. తెలిసి నేనెవరికీ ఏ చెడూ చేయలేదు. మరి ఎవరు నామీద ఇలా బురద చల్లుతున్నారు? పదుల సంఖ్యలో పెళ్లి సంబంధాలు చెడిపోయాక పోలీసులను ఆశ్రయించాను. సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు వెళ్లి, డీసీపీగారితో నా బాధను విన్నవించుకున్నాను. ఈ పనికి పాల్పడుతున్నవారు ఎవరైనా సరే, పట్టుకుని శిక్షిస్తానని ఆయన మాట ఇచ్చారు.

‘‘ఇంకెంతసేపు సర్. అతను నిజంగానే దొరికాడా?’’... ఆతృతనాపుకోలేక అడిగాను.
‘‘మావాళ్లు అతన్ని తీసుకొస్తున్నారమ్మా, కాసేపట్లో వచ్చేస్తారు’’... అన్నారు డీసీపీ.
 
ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని నాకు చాలా ఆదుర్దాగా ఉంది. ఇన్నాళ్ల ఆవేదన నాలో ఆవేశంలా ఉప్పొంగుతోంది. అతడు రాగానే కాలర్ పట్టుకుని కడిగేయాలి. నా జీవితాన్ని ఎందుకు నరకంలోని తోసేశావ్ అని నిలదీయాలి... ఇలా అనుకుంటుండగానే ఆ వ్యక్తి వచ్చాడు. కానీ అతడిని చూశాక... మాట పెగలలేదు. ఎందుకంటే... ఆ వచ్చిన వ్యక్తి, కాదు... పోలీసులు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు... నాన్న! అమ్మ అర్ధంతరంగా చనిపోతే నన్ను, అన్నయ్యలను కళ్లలో పెట్టుకుని పెంచినవాడు. ఖాకీల మధ్య ఖైదీలా నిలబడ్డాడు. నేను విస్తుపోయి చూస్తున్నాను.

 ‘‘ఎవరు సార్ వాడు? ఎవరు నా కూతురి శీలంపై మచ్చ వేసినవాడు? వాడిని నేను వదిలిపెట్టను.’’  నాన్న అరుపులను బట్టి పోలీసులు తనకి ఏం చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చారో అర్థమైంది నాకు. ఎలా స్పందించాలో తెలియక డీసీపీగారి వైపు చూశాను. ఆయన చిన్నగా నవ్వి నాన్నతో అన్నారు. ‘‘అదిగో... అక్కడున్నాడు చూడండి.’’ డీసీపీగారు చూపించిన వైపు చూసిన నాన్న... అక్కడ గోడకు వేళ్లాడుతున్న అద్దంలో తన ప్రతిబింబం చూసి అవాక్కయ్యాడు. ‘‘ఏంటి సార్... ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకిలా చేస్తాను’’ అంటూ విరుచుకుపడ్డాడు. కానీ డీసీపీగారు చెప్పిన వివరాలు విన్న తర్వాత కిక్కురుమనలేదు. పెళ్లికొడుకులందరికీ రకరకాల ఐడీల నుంచి మెయిల్స్ వెళ్లాయి. కానీ అన్ని మెయిల్సూ ఒకే ల్యాప్‌టాప్ నుంచి వెళ్లాయి. దాని ఐపీ అడ్రస్ ట్రేస్ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే... ఆ ల్యాప్‌టాప్ ఎవరిదో కాదు, నాదే. అందుకే నాన్న, అన్నయ్యల మీద నిఘా వేశారు. దాంతో నాన్న దొరికిపోయాడు. నేను స్నానం చేసేటప్పుడు, ఇంటి పని చేసుకుంటున్నప్పుడు నాకు తెలియకుండా నా ల్యాప్‌టాప్ నుంచే మెయిల్స్ పంపాడు నాన్న. పాము తన పిల్లల్ని మింగేస్తుందని తెలుసుగానీ... కన్నతండ్రే తన కూతురి జీవితాన్ని బలి తీసుకుంటాడని నేనెక్కడా వినలేదు. ఏం మాట్లాడగలను నేను? కన్నతండ్రికి శిక్ష వేయమని ఎలా కోరగలను? అందుకే కంప్లయింట్ వెనక్కి తీసుకున్నాను. అయితే నాన్నను ఒక ప్రశ్న మాత్రం అడిగాను... ‘‘ఇలా ఎందుకు చేశావ్ నాన్నా’’ అని. దానికి తను చెప్పిన సమాధానం విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అన్నయ్యలకు మంచి ఉద్యోగాలు లేవు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బాగా సంపాదిస్తున్నాను. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆ సంపాదన తనకు దక్కదు అన్న ఉద్దేశంతో చేశాడట. ఇల్లు నడపడం కష్టమవుతుందని భయపడ్డాడట. పిచ్చి నాన్న! ఈమాత్రం దానికి నా శీలాన్ని వేలం వేయాలా? నా మర్యాదకు పాతరేయాలా? నాతో ఒక్క మాట చెబితే పెళ్లి అన్న ఆలోచనను మనసులోంచి తుడిచేయనూ! రక్తాన్ని చెమటగా మార్చి మమ్మల్ని పెంచిన తన కోసం ఆ మాత్రం త్యాగం చేయలేనూ! ఆ మాటే అంటే తల దించుకున్నాడు. ఆ తర్వాత తను ఎప్పుడూ తలెత్తి నా కళ్లలోకి చూడలేదు!!
 - మాన్య, హైదరాబాద్ (బాధితురాలి పేరు మార్చాం)
 ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement