మన్యంలో నిషేధిత క్యాట్‌ఫిష్ అమ్మకాలు
మన్యంలో నిషేధిత క్యాట్‌ఫిష్ అమ్మకాలు
Published Sat, Aug 13 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
హుకుంపేట: నిషేధిత క్యాట్‌ఫిష్ విక్రయాలు విశాఖ మన్యంలో భారీగా జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల్లో జంతు కళేబరాలను మేతగా వేసి పెంచే క్యాట్‌ఫిష్‌ల్ని ప్రభుత్వం నిషేధించింది. వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు నిర్ధారించారు. మైదాన ప్రాంతాల్లో వీటి అమ్మకాలపై పూర్తి నిషేధం ఉండడంతో వ్యాపారులు మన్యానికి తెచ్చి వారపు సంతల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హుకుంపేటతో పాటు, పాడేరు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, మారుమూల మద్దిగరువు, అన్నవరం, లోతుగెడ్డ, కోరుకొండ, పెదబయలు, కించుమండ వారపు సంతల్లో వ్యాపారులు విచ్చలవిడిగా క్యాట్‌ఫిష్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో క్యాట్‌ఫిష్, ఇతర నిల్వ చేపల అమ్మకాలపై దృష్టి సారించిన కలెక్టర్, ఐటీడీఏ పీవోలు ఎపిడిమిక్ సీజన్ ముగిసేంత వరకు చేపల అమ్మకాల్ని ఏజెన్సీలో నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. గత వారం అన్ని వారపు సంతల్లోనూ చేపల అమ్మకాల్ని అడ్డుకున్నారు. క్యాట్‌ఫిష్‌లను విక్రయించొద్దని వ్యాపారుల్ని అధికారులు హెచ్చరించారు. కానీ అధికారులు సంత నుంచి వెళ్లిన మరుక్షణమే వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికైనా క్యాట్‌ఫిష్ అమ్మకాల్ని నిషేధించాలని గిరిజనులు కోరుతున్నారు.
Advertisement
Advertisement