జీవితాన్ని మార్చేసే సినిమా
విశాల్ భరద్వాజ్ సారథ్యంలో రూపొందుతున్న ‘హైదర్’ సినిమా తన జీవితాన్ని మార్చేస్తుందనే భావన కలుగుతోందని బాలీవుడ్ న టి శ్రద్ధాకపూర్ పేర్కొంది. విలియం షేక్‌స్పియర్ రచించిన ఓ నాటికను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారు. ‘ఓ విభిన్నమైన సినిమా ప్రపంచంలో ఉన్నట్టుగా తొలి సారి అనిపించింది. నన్ను నేను చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. వాస్తవానికి ప్రేక్షకులు కూడా వైవిధ్యాన్ని కోరుకుంటారు. పలు రకాల పాత్రల్లో చూడాలని ఆకాంక్షిస్తారు. ఈ సినిమాలో చేసే అవకాశం లభించడమే ఓ గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.
జీవితం మారిపోవచ్చనే భావన కలుగుతోంది’ అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధ.. తన మనసులోని భావాలను వెల్లడించింది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌తోపాటు టబు, ఇర్ఫాన్‌ఖాన్, కేకే మీనన్, షాహిద్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ‘షాహిద్‌కపూర్ నటన అద్భుతం. అటువంటి నటులతో కలసి పనిచేయడం అసాధారణమనిపిస్తోంది’ అని తెలిపింది.
ఈ సినిమా కోసం కాశ్మీర్‌లో సెట్టింగ్ వేశారు. అక్కడ చాలారోజులుగా జరుగుతున్న షూటింగ్‌లో శ్రద్ధాకపూర్ పాల్గొం టోంది. ‘షూటింగ్‌కు నాలుగురోజుల ముందే కాశ్మీర్‌కు వెళ్లా. కాశ్మీరీ యాస, భాషను అర్థం చేసుకోవడం కోసం, అనుకరించడం కోసమే ముందుగా వెళ్లా. అవసరం లేకపోయినా గొప్ప గొప్ప నటులు షూటింగ్‌లో పాల్గొంటుండడంతో సెట్స్ వద్దకు వెళుతుండేదాన్ని’ అని అంది. కాగా ‘హైదర్’ సినిమా ట్రయలర్స్‌కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా బాగా ఆడుతుందని శ్రద్ధాకపూర్ భావిస్తోంది.