
సాక్షి, సినిమా : విలియమ్స్ షేక్స్‌పియర్ నవలను కాస్త మార్చి చిత్రాలుగా తెరకెక్కించటంలో సీనియర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దిట్ట. మాక్‌బెత్ నుంచి మఖ్బుల్, ఒతెల్లో నుంచి ఓంకారా, హంలెట్ నుంచి హైదర్ సినిమాలను రూపొందించాడు. ఇప్పుడు ఆ ధ్యాస నుంచి బయటపడినట్లు ఉన్నాడు. అందుకే మరో క్రేజీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు.
అల్ ఖయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్‌పై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కేథరిన్ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ రచించిన ‘ది ఎక్సైల్ : ది స్టన్నింగ్ ఇన్‌సైడ్ స్టోరీ ఆఫ్ ఒసామా బిన్‌లాడెన్ అండ్ అల్ ఖయిదా ఇన్ ఫ్లైట్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. అబ్బొట్టాబాద్ అనే టైటిల్ ఫిక్స్ చేసేశాడు కూడా.
9/11 దాడుల నుంచి ఇప్పటివరకు ఉన్న ఉగ్రవాద నేపథ్యాన్ని, అందులోని చీకటి కోణాన్ని తెరపై చూపించబోతున్నాడంట. అయితే ఇందులో ఎవరు నటించబోతున్నారు.. తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో బిన్ తెరె లాడెన్ పేరుతో ఓ కామెడీ మూవీ బాలీవుడ్‌లో వచ్చింది.