'నాకు సినిమాలకంటే పుస్తకాలే ఎక్కువ'
ముంబయి: తనకు సినిమాలకంటే పుస్తకాలు, అందులో సాహిత్యమే చాలా ముఖ్యం బాలీవుడ్ చిత్రాల దర్శకుడు విశాల్ భరద్వాజ్ అన్నారు. 18వ మామీ చిత్రోత్సవంలో ఆయన బుధవారం మాట్లాడుతూ 'సినిమాల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశం. నా వరకు సినిమాలకంటే పుస్తకాలే ముఖ్యమైనవి. ఎందుకంటే.. మీ వద్ద మంచి పుస్తకాలుగానీ, సాహిత్యంగానీ లేకుంటే.. మంచి రచయితలు మనకు ఉండరు. మంచి రచయితలను తయారు చేయాలంటే మంచి పుస్తకాలను ఎప్పుడూ ప్రోత్సహించాల్సిందే. ఎక్కువ సాహిత్యంతో చాలామంచి సినిమాలు రూపొందించవచ్చు' అన్నారు.
అలాగే 'ఇప్పుడు జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసే ట్రెండ్ మొదలైంది. అంతకుముందు చేతన భగత్ రాసిన పుస్తకాల ఆధారంగా రెండు సినిమాలు వచ్చాయి. నేను కూడా షేక్ స్పియర్ రచనల ఆధారంగా సినిమాలు తీశాను' అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 2017 ఫిబ్రవరి 24న భరద్వాజ్ దర్శకత్వం వహించిన రంగూన్ అనే చిత్రం విడుదలకానున్న విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కంగనా రనౌత్, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్ నటిస్తున్నారు.