
అమితవ్ ఘోష్ అమెరికాలో స్థిరపడిన భారతీయ రచయిత. ఆయన రెండో నవల ‘ద షాడో లైన్స్’ ఆయనకి బాగా పేరు తెచ్చిపెట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం చాలా దేశాలు వలస పాలన నుండి విముక్తి పొందిన నేపథ్యంలో కొత్త దేశాలు, కొత్త సరిహద్దులు, పెల్లుబికిన జాతీయవాదం రచయితలకు కథావస్తువులైనాయి.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దానితో పాటు దేశం రెండుగా చీలిపోయింది. చిత్రంగా, స్వాతంత్య్రం కోసం కలిసి పోరాడిన శక్తులు ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క విభజన రేఖ ఇంతటి విలయాన్ని సృష్టించడం, మనుషుల మనసుల్లో గిరిగీసుకున్న దాటరాని వలయం – అదే షాడో లైన్స్ అంటే!
ఈ నవలలో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ, కథ ముఖ్యంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ప్రథమ పురుషలో కథని వివరించే పేరులేని యువకుడు, అతని నానమ్మ (ఆమెను ‘తామ్మ’ అని పిలుస్తాడు), ఇంకా అతని చిన్నాన్న త్రిదేబ్.
చిన్నాన్న త్రిదేబ్ అంటే బాల్యంలో కథకుడికి ఒక రోల్‌మోడల్, ఆదర్శం. అతని హఠాన్మరణం అతనికొక మిస్టరీ. బాల్యం, యవ్వనం మధ్య అతని జ్ఞాపకాలు ఊగిసలాడుతుంటయ్.
సరిహద్దు ఆవలికి జరిగిపోయిన తన పుట్టిన ఊరు ఢాకా చూడాలని ఒకప్పుడు తహతహలాడిన బామ్మ తీవ్రమైన వైముఖ్యంతో మాట్లాడుతుంది 1962 ఇండో–పాక్ వార్ ప్రజ్వరిల్లినప్పుడు. ‘మనని వాళ్లు చంపడానికి రాకముందే వాళ్లని తుద ముట్టించాలి’ అని ఆమె హిస్టీరికల్‌గా మాట్లాడటం బాల్యంలో అతనికొక ఆశ్చర్యం. పెరిగి పెదై్ద తానుగా శోధించి సంఘటనల మూలాల్లోకి వెళ్లి సత్యం తెలుసుకుంటాడు. అదే ఉత్కంఠను మనం చివరిదాకా అనుభవిస్తాం.
యువకుడి నాయనమ్మ బంగ్లాదేశ్ ఏర్పడ్డ (తూర్పు పాకిస్తాన్) సమయంలో కలకత్తాకు వలస వస్తుంది. తాను పుట్టి పెరిగిన ఢాకా ఇప్పుడు పరాయి దేశంలో భాగం అనే యధార్థాన్ని స్వీకరించడానికి ఆమె మనసులో ఒక తీవ్రమైన పెనుగులాట. తను పుట్టిన ఊరు చూడడానికి అక్కడ దగ్గరినించి ఆహ్వానం అందినప్పుడు (ఆమె భర్త ఢాకా ఎంబసీలో అధికారి) అదే ద్వైధీ భావనకు లోనవుతుంది. రెండు దేశాల మధ్య విమానం ఎగిరేప్పుడు సరిహద్దు రేఖ కనిపిస్తుందా? మరి లేదంటే ‘విభజన’ మాటకు అర్థమేమిటి? ఎన్నో సందేహాలు.
దురదృష్టవశాత్తు అదే సమయంలో కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్ల ప్రభావం ఢాకాలో ప్రతిధ్వనిస్తుంది. తన చిన్నప్పటి ఇంటికి కారులో వెళ్లి వస్తుంటుంది తామ్మ, ఆమెతో పాటు త్రిదేబ్, ఇతరులు. హఠాత్తుగా ఎదురైన అల్లరి మూకలు కారును, వెనుక రిక్షాలో వస్తున్న ఆమె పెదనాన్నను చుట్టుముడతాయి. అప్పుడే యువకుడి చిన్నాన్న త్రిదేబ్ వారి చేతులలో హతమౌతాడు. నానమ్మ మనసు విరిగిపోయింది. ఒక్కసారి హద్దు గీయబడిందంటే అది అనుల్లంఘనీయం అనే కఠిన వాస్తవం ఎరుకలోకి వచ్చింది.
- తెన్నేటి శ్యామకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment