
కొత్త ఉషోదయాల కోసం ఎదురుచూపులు
సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతోపాటు, పాత ఉద్యమరీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి. వీటిని పునఃసమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం.
రెండో ప్రపంచయుద్ధం తరువాత (1939-1945) చాలా దేశాలలో స్వాతంత్య్రోద్యమాలు బలపడ్డాయి. శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గిన ప్రజలు తమ ఆగ్రహానికి మరింత పదును పెట్టి, స్వేచ్ఛను సాధించు కునే దిశగా కదిలారు. అమెరికా సం యుక్త రాష్ట్రాలలోని నల్లవారితో పాటు; లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రి కా ప్రాంతాల ఉద్యమశక్తులు సైతం అలజడులను తీవ్రం చేశాయి. అయితే ఈ పరిణామాలే పెట్టుబడిదారీ వర్గాలలో ఐక్యతకు కారణమైనాయన్నది మరొక సత్యం. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అవి ఒక పథకం తయారుచేసుకున్నాయి. తనను తాను కొనసాగించుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేక వ్యూహాలను రచించుకుంటూనే ఉంటుంది. ప్రచ్ఛన్నయుద్ధం, సోవియెట్ రష్యా పతనానంతర ఏక ధ్రువ ప్రపంచంలో కూడా ఆ వ్యవస్థ తనదైన ఉనికిని చాటుకోవడానికి అడ్డూ అదుపు లేని రీతిలో వ్యూహ రచన చేస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు కనిపిస్తున్న అనేకానేక సంక్షోభాలు ఆ వ్యూహాల ఫలితమే. ఆఖరికి ఉద్యమాల నుంచి జనించిన ప్రసార సాధనాలు, అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చిన అక్షరాలు ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలో ఆయు ధాలుగా మారినాయి. ఈ నేపథ్యంలో వామపక్ష, ప్రగతిశీల శక్తులు వహించవలసిన పాత్ర ఏమిటి? అసలు ఉద్యమం ఎలా ఉండాలి? ఇవే అందరి ముందు ఉన్న కొత్త ప్రశ్నలు.
సంపద అంతా ఒకేచోట పోగుపడడమనే పరిణామం కూడా రెండో ప్రపంచ యుద్ధానంతరమే విపరీతంగా కనిపిస్తుంది. కోటీ శ్వరుల సంఖ్య పెరిగింది. కొన్ని దేశాల బడ్జెట్ కన్నా, కొద్దిమంది సంపదే ఎక్కువ. ప్రపంచ సంపద 15 శాతం పెట్టుబడిదారుల దగ్గర కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు నాలెడ్జ్ ఎకానమీ తయారయింది. ఇప్పటి వరకు జరగని ఆవిష్కరణలను అడ్డం పెట్టుకుని, వాటితో కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు సెల్ ఇంజనీరింగ్. మూత్రపిండాలతో పాటు, ఇతర అవయవాల మార్పిడి కూడా దీని ఫలితమే. ఇది వైద్యరంగంలో కొత్త లాభాలకు దారులు వేసింది.
పైగా ఆ లాభాలన్నీ భారీగా ఉండడంతో పెట్టుబడిదారీ వర్గం వైద్యరంగం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. దీనితో పాటు విశ్వవిద్యాలయాలను కూడా ఆ వర్గం తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇందుకు కారణాలను ఊహించడం కష్టం కాదు. 20వ శతాబ్దం వరకు ఉద్యమాలకు, ఆందోళనలకు విశ్వవిద్యాలయాలే ఆలవాలంగా ఉన్నాయి. విప్లవాలకు బీజాలు వేసినా, ప్రజాస్వామిక భావాలకు ప్రాచుర్యం లభించినా అదంతా విశ్వవిద్యాలయాల తరగతి గదుల దగ్గరే ఆరంభమైంది. ఇది గుర్తించే పెట్టుబడిదారీ వర్గం విశ్వవిద్యాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకునే పని మొదలుపెట్టింది. విద్య, వైద్యం అనే రెండు మహోన్నత రంగాలు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఇదే. రాజ్యాధికారం మీద మరింత పట్టు సాధిం చడానికి సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం మీద పెట్టుబడిదారీ వ్యవస్థ ఒత్తిడి పెంచే పని కూడా ఆరం భించింది.
ఈ మొత్తం పరిణామం ప్రపంచ వ్యాప్తంగా కొత్త రాజకీయ వాతావరణానికి దోహదం చేసింది. దీనినే ప్రైవేటైజేషన్, గ్లోబలై జేషన్, లిబరలైజేషన్ అంటున్నారు. వారి వ్యూహంలో భాగంగా ప్రతి దేశంలోను పెట్టుబడిదారుల వికేంద్రీకరణ ప్రక్రియ కూడా జరిగింది. పెట్టుబడిదారులు ఆయా దేశాలలోని రాజకీయాల మీద ఆధిపత్యం సాధించారు. ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల రేటు కంటే, పెట్టుబడిదారుల ఎదుగుదల రేటు హెచ్చుగా ఉంటే అసమానతలు పెచ్చరిల్లుతాయి. 21వ శతాబ్దం లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగింది. సంపద కూడా అపా రంగా పెరిగింది. వాటితో పాటు దారిద్య్రం కూడా పెరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిణామాన్నే ఆర్థికవేత్తలు ’R' is greater than ’G’ అన్నారు.
ఆర్ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ క్యాపిటల్, జి అనేది రేట్ ఆఫ్ నేషనల్ గ్రోత్. ప్రైవేటు పెట్టుబడి జాతీయ పెట్టుబడిని మించిపోతే వ్యవస్థ సమతౌల్యం దెబ్బతింటుంది. అందుకే, ‘సంపద పంపిణీనీ, ఆదాయాన్నీ క్రమబద్ధీకరించనంత కాలం ప్రపంచంలో దారిద్య్ర నిర్మూలన జరగదు’ అంటాడు ప్రముఖ ఆర్థికవేత్త, ట్వెంటీఫస్ట్ సెంచరీ రచ యిత థామస్ పికెటీ. విజ్ఞానం ఇచ్చిన ఫలితాలను, ఆ రంగంలో జరిగిన పరిశోధనలను పెట్టుబడిదారీ శక్తులు ఉపయోగించు కున్నంతగా శ్రామిక శక్తులు వినియోగించుకోలేక పోయాయి. అందుకే నేటి ఉద్యమాలన్నింటికీ సంపద పంపిణీ అనే అంశమే కేంద్రబిందువు కావాలి. ఈ నేపథ్యంలో మార్పును కోరే వారంతా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి.
సంపదను సమంగా పంచడానికీ, లేదా సకల వర్ణాలు దానిని సమంగా అందుకోవడానికీ ఏం చేయాలి? పెట్టుబడి దారీ శక్తులు కాలాన్ని బట్టి తమ స్వరూపాన్ని మార్చుకుంటూ రాజకీయ శక్తిగా, రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా, ఆర్థిక శక్తుల ను నిర్దేశించే వ్యవస్థగా అవతరించి విద్య వైద్యం వంటి కీలక రంగాలను హస్తగతం చేసుకున్నాయి. ఈ వాస్తవాన్ని గమనం లోకి తీసుకుని ఉద్యమంలో ఏ అంశాలను ముందు వరసలో ఉంచాలి; ఏ వర్గాలను కదిలించాలి? అనే విషయాలను నిర్ణ యించడం ముఖ్యం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతో పాటు, పాత ఉద్యమ రీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి.
వీటిని పునః సమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం. భూ స్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా దున్నేవానిదే భూమి, సమ సమాజ స్థాపన వంటి నినాదాలు ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చా యి. కానీ కంప్యూటర్ యుగంలో ఉద్యమాల తాత్వికత ఎలా ఉండాలన్నది కూడా చర్చనీయాంశమే. సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. అసలు మార్కెట్ శక్తుల నుంచి సంప దను విడదీయడానికి అవసరమైన ఉద్యమాలు ఎలా ఉండాలి? వీటి మీద లోతైన చర్చ అవసరం. ఆధునిక ఉద్యమాల రూప కల్పనే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం.
- వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు
- చుక్కా రామయ్య