పోలండ్ చిన్నారులతో నవానగర్ రాజు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలమంది భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులకు పరుగెడుతున్నారు.. అలా వస్తున్న మనవారికి పోలండ్ సహకరిస్తోంది.. విమానాల ద్వారా భారత్‌కు వెళ్లేందుకు తోడ్పడుతోంది. ఇది ఈనాటి దృశ్యం.... కానీ ఒకప్పుడు దీనికి రివర్స్‌గా జరిగింది తెలుసా? పోలండ్ నుంచి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తే.. ఇక్కడ ఒక ‘గుడ్ మహారాజా’ వాళ్లను ఆదరించారు. ఆ విశేషాలు ఇవి.. – సాక్షి సెంట్రల్‌డెస్క్
అప్పుడేం జరిగిందంటే..
..దాదాపు 80 ఏళ్ల క్రితం.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నేతృత్వంలోని సోవియట్ యూనియన్ చేతిలో పోలాండ్ అతలాకుతలం అవుతున్న సమయం. యుద్ధ సంక్షుభిత పోలండ్ నుంచి, సోవియట్ అధీనంలోని జైళ్ల నుంచి.. పోలండ్ చిన్నారులను శరణార్థులుగా వదిలివేశారు. 1942లో సోవియట్ సైన్యం.. రెండేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 600 మందికిపైగా పిల్లలను ఓ నౌకలో ఎక్కించి పంపించేసింది. ఆ షిప్‌ను ఏ నౌకాశ్రయంలో ఆపినా.. ఎవరూ పట్టించుకోలేదు. ఆశ్రయం ఇవ్వలేదు. అలాంటి సమయంలో ఆ నౌక ప్రస్తుత గుజరాత్ తీరంలోని నవానగర్‌కు చేరింది. నవానగర్ రాజు ‘జామ్‌సాహెబ్ దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా’ ఎంతో పెద్ద మనసుతో వారిని అక్కున చేర్చుకున్నారు.
ది గుడ్ మహారాజా స్క్వేర్
మీరందరూ నా పిల్లలే..
పోలండ్ నుంచి వచ్చిన చిన్నారుల్లో దాదాపు అందరూ అనాథలుగా మిగిలినవారే. దీనిపై చలించిపోయిన నవానగర్ మహారాజు ఆ పిల్లలెవరినీ అనాథలుగా చూడొద్దని, వారంతా నవానగర్ పౌరులని, రాజ్యాధినేతగా తాను వారికి తండ్రిలాంటి వాడినని ప్రకటించారు. ఆ పిల్లల కోసం ప్రత్యేక క్యాంపులు, పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వైద్యం అవసరమైన వారికి చికిత్స చేయించారు. అలా నాలుగేళ్లపాటు వారి ఆలనాపాలనా చూసుకున్నారు. వారు కూడా నవానగర్ మహారాజును ‘బాపూ (తండ్రి)’గా పిలుచుకునేవారు. పోలండ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత 1946 నుంచి దశలవారీగా వారు తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. మన దేశం నుంచి బ్రిటీష్‌వారు వెళ్లిపోవాలంటూ క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయమది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగుతున్న ఆ సమయంలో ఐరోపా దేశాల పిల్లలను ఆదుకునేందుకు నవానగర్ మహారాజు చూపిన చొరవ ప్రశంసలు పొందింది. ఇంత ఘనత పొందిన నవానగర్ మహారాజు 1966లో కన్నుమూశారు.
పోలండ్‌లో.. మన మంచి మహారాజు
నవానగర్ మహారాజు చూపిన ఔదార్యానికి పోలండ్ మర్చిపోలేదు. పోలిష్ రిపబ్లిక్‌గా ఏర్పాౖ టెన తర్వాత ఆ దేశ అత్యున్నత అవార్డు అయిన ‘కమాండర్స్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్’తో ఆయన్ను గౌరవించింది. వార్సా నగరంలోని హైస్కూల్‌కు ‘మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ, రంజిత్‌సింగ్‌జీ జడేజా’ పేరు పెట్టింది. అంతేకాదు.. 2013లో వార్సాలోని ఓ జంక్షన్‌కు ‘ది గుడ్ మహారాజా స్క్వేర్’ అని నామకరణం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment