షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది.
బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment