'సోషలిజాన్ని అనుసరించి ఉండాల్సింది'
సీతంపేట: దేశంలో రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధమైన వ్యవస్థ లేదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. విశాఖపట్నం జిల్లాలో సీపీఐ(ఎం) 21వ అఖిల భారత మహాసభలలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్‌లో ‘ప్రైవేటు రంగం, రిజర్వేషన్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె ప్రసంగించారు. స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ వ్యవస్థను కాకుండా సోషలిజాన్ని అనుసరించి ఉంటే కుల, మత, అసమానతలు లేని గొప్ప ప్రజాస్వామ్య భారతదేశం ఆవిష్కృతమయ్యేదని అభిప్రాయపడ్డారు.
దేశంలో రిజర్వేషన్లు ఒక వివాదస్పదమైన అంశమని, ఎందుకు వివాదస్పదమైనదో సులువుగా అర్థం చేసుకోవచ్చన్నారు. శతాబ్దాల నుంచి దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేస్తున్నా వారి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కన్పించడం లేదని తెలిపారు. కేవలం పారిశుద్ధ్యం, చేతివృత్తులకే దళిత వర్గాలు పరిమితమయ్యాయని, అత్యున్నత స్థానాలు వారికి దక్కడం లేదని బృందా కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. 2010లో ప్రభుత్వ సర్వేల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 41 శాతం ఉపాధి పొందగా, ఎస్సీ, ఎస్టీలు కేవలం 14 శాతం మాత్రమే ఉపాధి పొందారని స్పష్టమైందని ఆమె తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇతర కులస్థులు 37 శాతం ఉపాధి పొందగా, దీనిలో మూడవ వంతు షెడ్యూల్ కులాలు ఉపాధి పొందుతున్నట్లు సర్వేలలో స్పష్టమైందన్నారు. ఈ పరిస్థితులలో మార్పు రావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవస్థ, విధానాలు అనుసరించాలని బృందా కారత్ కోరారు.