ఇవ్వాళ కమ్యూనిస్టులైనా, సోషలిస్టులైనా, మత తత్త్వ వాదులైనా అంబేడ్కర్‌ను స్మరించడం సాధారణ దృశ్యమయ్యింది. సంఘ్ పరివార్ శక్తులతోపాటూ... కాంగ్రెస్‌లో ఉన్న హిందూ తత్త్వం ఒంటబట్టించుకున్న అనేక మంది నాయకులూ అంబేడ్కర్ బతికున్న కాలంలోనూ అనేక సందర్భాల్లో ఆయన్ని వ్యతిరేకించినవారే. భారత్‌లో వర్గం అంటే కులమేననీ... కుల వ్యవస్థ నశిస్తే కానీ వర్గ వ్యవస్థ కనుమరుగు కాదనీ, అప్పుడుకానీ సామ్యవాద సమాజ స్థాపన సాధ్యంకాదనీ అంబేడ్కర్ అన్న మాటలను కమ్యూనిస్టులూ, సోషలిస్టులూ పట్టించుకోలేదు. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడూ, బీసీ నేత ములాయం సింగ్ యాదవ్ తుది శ్వాస విడిచిన ఈ తరుణంలో మరొకసారి ఈ దిశలో చర్చ జరగవలసిన అవసరం ఉంది.
భారతదేశ రాజకీయాల్లో రామ్ మనోహర్ లోహియా ప్రతినిధిగా రాజకీయాల్లో జీవిం చిన ప్రముఖ నాయకుడు ములాయం సింగ్ యాదవ్. అక్టోబర్ 11న ఆయనకు తుది వీడ్కోలు పలకడం భారతదేశానికి ఒక విషాద ఘట్టమే. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత ఒక సోషలిస్ట్ బీసీ రాజకీయ నాయకుడు చనిపోయినప్పుడు ఇవ్వకపోవడం బ్రాహ్మణవాద భావజాలమే ఇంకా నడుస్తుందనడానికి ఒక నిద ర్శనం. ఇది చాలా బాధాకరమైన విషయం.
భారతీయ సోషలిస్ట్ విధానాన్ని రూపొందించిన రావ్‌ు మనోహర్ లోహియా ఒక మార్వాడీ కులం నుండి వచ్చారు. కానీ ఆయన బీసీ లకు రాజకీయ అధికారం కావాలని నినదించారు. ఆ స్ఫూర్తి నుండి వచ్చిన వారే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్, ములాయం సింగ్ యాదవ్ వంటివారు. ఇంకా ఎందరో రాజకీయ నాయకులు లోహియా ప్రభావంతో రాజకీయాల్లో బ్రాహ్మణవాద రాజకీయాలకు ఎదురు నిలబడ్డారు. ఈరోజు బీజేపీ అనే ఒక పార్టీ ఏర్పడిందంటే ఆరోజు వాళ్ల కాంగ్రెస్‌కు వ్యతిరేక పోరాటాలే అనేది మరువరాదు. మండల్ కమిషన్ నివేదిక అమలు జరపాలని లోహియా స్ఫూర్తితో వీపీ సింగ్ ముందుకు వచ్చేటప్పటికి జనతా పార్టీ చీలిపోయి మతోన్మాద బీజేపీ ఏర్పడింది.
కమ్యూనిస్టులు, కార్ల్ మార్క్స్ వర్గ సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయం చేయలేకపోయారు. అలా అన్వయం చేసి వుంటే భారత దేశంలో నిజమైన వైరుధ్యం కులం అని గుర్తించేవారు. అమానవీయ అస్పృశ్యతా నిర్మూలన ద్వారానే కుల నిర్మూలనా సాధ్యమనే లోహియా వాదులూ దీనిని విస్మరించారు. మొదటి నుండి లోహియా వర్గంలో సోషలిస్టులు అగ్ర వర్ణాలకు సంబంధించినవారే ఎక్కువ. లోహియాకి గాంధీ మీద అపారమైన గౌరవం వుంది. కానీ ఇద్దరి అభిప్రాయాలూ చాలా భిన్నమైనవి. లోహియాకు దేవుడిపై విశ్వాసం లేదు. ఆయన నాస్తికుడు. గాంధీజీ దేవుడు, సత్యం, అంతర్వాణి వంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా గాంధీజీతో లోహియా చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చాడు. 1948 జనవరి 28న గాంధీజీ లోహియాతో ‘నీతో చాలా విషయాలు వివరంగా మాట్లాడాలని వుంది. కానీ నాకు సమయం దొరకటం లేదు. నా గదిలోనే నీవు కూడా పడుకో. మనం రాత్రికి మాట్లాడు కుందాం’ అన్నాడు. లోహియా గాంధీతో పాటు ఆయన గదిలోనే పడుకున్న ప్పటికీ గాంధీజీ లోహియా నిద్రకు భంగం కలిగించలేక పోయాడు. మరుసటి రోజు లోహియాతో గాంధీజీ, ‘నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని, సోషలిస్టు పార్టీ గురించీ, కాంగ్రెస్ గురించీ ఏదో ఒకటి నిర్ణయించాలని అందువల్ల మరుసటి రోజు (జనవరి 30) సాయంత్రం తప్పకరావాలని’ అన్నాడు. కానీ ఆ రోజే ఆయన మతోన్మాది చేతుల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. లోహియా అనుచరులంతా ఆయన భావజాలాన్ని తీసుకోలేదు. గాంధీ భావాలే లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇతర సోష లిస్టుల్లోనూ ఎక్కువగా వున్నాయి. అందుకే వీరు బీజేపీని ఎదిరించలేక పోతున్నారు.
ఇకపోతే అస్పృశ్యుల జీవితాలు చూసి అంబేడ్కర్ తన జీవితంలో ఎన్నోసార్లు కంటతడి పెట్టాడు. ఈ సమాజంలో తన ప్రజలు ఎందుకు అస్పృశ్యులుగా జీవిస్తున్నారు. ఈ హిందువులు కుక్కలకు సబ్బుపెట్టి స్నానం చేయిస్తూ, వాటికి పసుపు రాస్తూ వాటిని గౌరవిస్తూ... సాటి మనిషిని నువ్వు అంటరాని వాడివి అంటూ ఎందుకు హింస చేస్తు న్నారు? అని ఎంతో మథనపడ్డాడు. ఆ మథనం నుండే ఆయన వ్యక్తిత్వం రూపొందింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ తీసుకున్న మేధావికి బరోడాలో ఒక మామూలు బంట్రోతు మంచి నీళ్ళు ఇవ్వకుండా నిరాకరించినందుకు ఆయన తపన చెందాడు. ఆ తపన నుండే ఆయన ఉద్యమాన్ని సృష్టించాడు. తన లక్ష్య సాధన కోసం, అస్పృశ్యుల సమస్యలను ప్రభుత్వం ముందు వుంచడం కోసం, వారి కష్టాలను తొలగించడం కోసం ఒక కేంద్ర వ్యవస్థ ఏర్పాటుపై అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం 1924 మార్చి 9వ తేదీన బొంబాయిలోని దామోదర్ హాల్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తీవ్రమైన చర్చోపచర్చల తర్వాత ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. తదనుగుణంగా జూలై 20వ తేదీన ‘బహిష్కృతకారిణి సభ’ను 1860 చట్టం కింద నమోదు చేశారు.
దళితుల చరిత్రను రూపొందించడంలో అంబేడ్కర్ త్యాగపూరిత మైన కృషిని నిర్వహించారు. భారత సామాజిక వ్యవస్థలో కులం, అస్పృశ్యత ఎలా ఏర్పడ్డాయో తెలియకుండా భారతదేశంలో నూతన వ్యక్తిత్వ నిర్మాణం జరగడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు కులంలేని మనుషులు కావాలి. కుల జీవితం భారతదేశంలో ఒక నిబద్ధతగా మారిపోయింది. అందుకే అంబేడ్కర్ కులం గురించి తన కుల నిర్మూ లనా గ్రంథంలో ‘హిందూ సమాజం ఒక కులాల సమ్మేళనం. ప్రతి కులమూ అదొక పరిమిత సంస్థ కాగా అందులోకి క్రొత్తవాడికి ప్రవేశం లేదు. ఇతర మతాల వాళ్ళను, జాతులను తమ మతంలో కలుపుకొని తద్వారా తమ మతాన్నీ, తమ సమాజాన్నీ విస్తరింపజేసుకొనే అవ కాశం హిందువులకు లేకుండా పోవడానికి కారణం కేవలం కులవ్యవస్థే’ అని పేర్కొన్నాడు.
అంబేడ్కర్‌ను పూర్తిగా వ్యతిరేకించాలనే బీజేపీ వ్యూహం సామాజిక న్యాయం వైపుకు నడవడంలేదు. దళితులపై ద్వేషాన్ని ప్రకటిస్తుంది. ఆవు పేరు చెప్పి ఎంతోమంది దళితులను వేటాడారు. ముస్లివ్‌ులపై ద్వేషాన్ని కుమ్మరించారు. తేజస్వినీ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ వంటివారంతా దళితులపై అణచివేతను నివారించడానికి గొప్ప ఉద్యమం నడపలేకపోయారు. మధ్యతరగతి రైతులు, మధ్య తరగతి భూస్వాములుగా వ్యవహరించారు. వీళ్ళకు అంబేడ్కర్ భావజాలం ఒంటబట్టే వరకూ బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేరు. ఆ పార్టీకీ వీళ్ళకు సన్నని గీత మాత్రమే తేడా వుంది. అంబే డ్కర్ భావజాల స్ఫూర్తిలో బౌద్ధం దాగి వుంది. ముఖ్యంగా స్త్రీ విముక్తి పోరాటంలో కూడా వీరు అంబేడ్కర్ ఆలోచనలను తీసు కోలేదు. కనీసం మహాత్మాఫూలే, సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తి కూడా వీరి దగ్గర లేదు. అంబేడ్కర్ భార్య చనిపోయిన తరువాత కూడా కామతృష్ణకు గురికాకుండా జీవించాడు. గాంధీ, నెహ్రూల స్త్రీలకు సంబంధించిన కథనాలు లాంటివి అంబేడ్కర్‌కు లేవు. ఆయన మరో బుద్ధుడిలా జీవించాడు. స్త్రీ వ్యామోహం అనేక మంది నాయకుల్ని పతనావస్థకు తీసుకెళ్ళింది. వ్యక్తిత్వం అనేది వ్యామోహ రహితమైన దైతే కానీ విశ్వవ్యాపితమైన ప్రేమను అందించ లేరు. అంబేడ్కర్ స్త్రీల పట్ల గౌరవంగా వుండడమే గాక ‘హిందూ కోడ్ బిల్’ ద్వారా వారి హక్కులను సాధించిన మహోన్నత వ్యక్తి.
ఏ నాయకుడైతే స్త్రీల చేత గౌరవించబడతారో ఆ నాయకుడే ప్రపంచ వ్యాపిత కీర్తిని ఆర్జిస్తాడు. స్త్రీలు నిశ్శబ్ద ప్రచారకులు. వారొక వ్యక్తిత్వాన్ని గౌరవిస్తే దాన్ని మౌఖికంగా ప్రచారం చేస్తారు. అంబే డ్కర్‌కి విపరీతమైన స్త్రీల ఫాలోయింగ్ వుండేది. బ్రాహ్మణ స్త్రీల దగ్గర నుండి దళిత స్త్రీల వరకు వారి విముక్తి కోసం ఆయన తన మంత్రి పదవికే రాజీనామా ఇచ్చాడు. స్త్రీలలో ప్రేమనూ, దుఃఖాన్నీ, వ్యధనీ చూశాడు. స్త్రీల అభ్యున్నతి కోసం మథన పడ్డాడు.
లోహియా భావాలు కూడా సామ్యవాద భావాలే. అయితే ఇప్పుడున్న సోషలిస్టులు సామాజిక న్యాయ సాధనలో అస్పృశ్యతా నివారణ, కుల నిర్మూలన కోసం సామాజిక సాంస్కృతిక విప్లవ భావాలతో ముందుకు రావాల్సివుంది. బహుజన, దళిత, మైనార్టీల విముక్తి కోసం కొత్త రాజకీయ ఎజెండాతో ముందుకు నడవవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. ములాయం సింగ్ స్మృతిలో లోహియా భావాల పునరుజ్జీవనమే గాక... అంబేడ్కర్ ఆలోచనలతో వాటిని సమన్వయం చేసుకోవడం అవసరం. ఈనాటి రాజకీయాలకు ఈ సమన్వయం అవసరం. అప్పుడే భారత్‌లో సామ్యవాద, సాంఘిక వాద రాజకీయ పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ దిశగా నడుద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment