
వాషింగ్టన్ : సుందరమైన ప్రాంతాలున్న రాష్ట్రం, గాడ్స్ ఓన్ కంట్రీగా కేరళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో కూడా ఆ చిన్న రాష్ట్రం గురించి పెద్ద కథనాలే వెలువడ్డాయి. అయితే అది పర్యాటక కోణంలో కాకపోవటమే ఇక్కడ విశేషం.
కేరళలో ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఆదివారం తమ సంచికలో ఫ్రంట్‌పేజీలో ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఏ కమ్యూనిస్ట్ సక్సెస్ పేరుతో భారతదేశంలో ఓ చిన్న రాష్ట్రంలో కమ్యూనిజం ఇంకా బతికే ఉందని.. కలలు సాకారం చేసుకునేందుకు అక్కడ కృషి జరుగుతోందంటూ కథనం వెలువడింది.
ప్రముఖ పాత్రికేయులు గ్రెగ్ జఫ్ఫె, విది దోషి.. ఈ ప్రత్యేక కథనాన్ని రచించారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐసాక్ ఇంటర్వ్యూతోపాటు పలు అంశాలను కూడా అందులో ప్రస్తావించారు. ఎన్నికలద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడడం అనేది ప్రపంచంలోనే మొదటిసారిగా ఇక్కడ జరగిందని.. వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు విస్తృతంగా ఆదరించటం మూలంగానే కేరళలో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ విరజిల్లుతోందంటూ థామస్ అందులో వివరించారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ హయాంలో సాధించిన ఘనతలను కూడా ఆ కథనం విపులంగా వివరించింది.
అమెరికా ప్రధాన వార్తలను సైతం పక్కన పడేసిన ఈ స్టోరీపై పాఠకులు దృష్టిసారించటం విశేషం. ఇదిలా ఉంటే కేరళ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. గ్లోబల్ ఫేస్ అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment