ఒక స్త్రీ యజమాని. మరో స్త్రీ ఆమె వద్ద పని చేసే చిన్న ఉద్యోగి. ఉద్యోగి ఒక సాయంత్రం ఒక అంధునికి సాయం చేసింది. అది యజమాని దృష్టికి వచ్చింది. దయ గల స్త్రీ తన వద్ద ఉద్యోగం చేస్తున్నందుకు
సంతోషపడి తనూ ఆమెపై దయ చూపింది. ఆ ఉద్యోగికి కొత్త ఇల్లు బహూకరించింది. కేరళలో జాలీ అలుకాస్, ఆమె ఉద్యోగి సుప్రియల కథ ఇప్పుడు దేశం మెచ్చుతున్న కథ.
జూలై 7, 2020 సుప్రియ జీవితాన్ని మార్చేసిన రోజు. ఆ రోజు తన జీవితాన్ని మారుస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. చిన్న ఉద్యోగి ఆమె. అలెప్పి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువెల్లా పట్టణంలోని ‘జాలీ సిల్క్స్’లో ఆమె సేల్స్ ఉమన్. సాయంత్రం ఆరున్నరకు డ్యూటీ దిగి బస్‌స్టాప్‌వైపు నడుస్తోంది ఇల్లు చేరడానికి. అక్కడే ఒక అంధుడు రోడ్డు మీద నడవడానికి అవస్థ పడుతున్నాడు. ఆమె అతణ్ణి చూసింది. ‘ఎక్కడకు వెళ్లాలి’ అని అడిగింది.
తాను టౌన్ బస్ ఎక్కాలని, మంజాది అనే ప్రాంతానికి వెళ్లాలని ఆ అంధుడు చెప్పాడు. అప్పుడే ఒక ఆర్‌టిసి టౌన్ బస్సు వారిని దాటుకుంటూ వెళుతోంది. అది అంధుడు వెళ్లాల్సిన ప్రాంతానికి చెందిన బస్సే. సుప్రియ అది గమనించింది. వెంటనే బస్సు వెనుక పరుగు తీసింది. ఆమెను గమనించిన బస్సు డ్రైవరు, కండెక్టరు బస్సును ఆపారు. ‘ఒక అంధుడు బస్సెక్కాలి. ఉండండి’ అని చెప్పి వెనక్కు పరిగెత్తి అంధుడి చేయి పట్టుకుని బస్సు దాకా తీసుకొని వచ్చింది. ఆ తర్వాత బస్సు ఎక్కించి వెళ్లిపోయింది. ఇది ఏ మనిషైనా చేసే కనీస పని అని అంతటితో ఆ సంగతి మర్చిపోయింది.మారిన కథ
అయితే ఈ దయామయ ఘటనను ప్రకృతి రికార్డు చేయదలిచింది. అదే రోడ్డులో ఒక షాపింగ్ కాంప్లెక్స్‌లో పని చేస్తున్న జాషువా అనే సేల్స్‌మేన్ ఐదో ఫ్లోర్ నుంచి కాలక్షేపానికి రోడ్డు వైపు చూస్తూ ఈ సన్నివేశం కనపడటంతో సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. సుప్రియ చేసింది చాలా మంచి పని అని అతనికి అనిపించింది. ఫ్రెండ్‌కు పంపాడు. ఆ ఫ్రెండ్ నుంచి మెల్లగా అది సోషల్ మీడియాకు ఎక్కింది. సాయంత్రం ఆరున్నరకు ఘటన జరిగితే రాత్రి 10.30కు ఇది దేశమంతా వైరల్ అయ్యింది. ఇవన్నీ తెలియని సుప్రియ ఇంట్లో ఉంటే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ‘నువ్వే కదా’ అనడం మొదలెట్టారు. రాత్రికి రాత్రి సుప్రియ ఆ ప్రాంతంలో స్టార్ అయిపోయింది.
యజమాని స్పందించింది
సుప్రియ పని చేస్తున్నది దేశంలో బంగారు వ్యాపారాల దిగ్గజమైన జాయ్ అలుకాస్ సతీమణి జాలీ అలూకాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జాలీ సిల్క్స్’లో. సుప్రియ చేసిన మంచి పని ఆ నోటా ఈ నోటా ఈ భార్యాభర్తలకు చేరింది. తమ ఉద్యోగిలోని దయాగుణం వారికి నచ్చింది. జాలీ అలూకాస్ పూనికతో జాయ్ అలూకాస్ సుకన్యను అభినందించడానికి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లాడు. సుకన్య భర్త అనూప్ చిన్న ఉద్యోగి. ఇద్దరూ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారిని అభినందించిన జాయ్ అలూకాస్ ‘త్రిసూర్‌లో ఉన్న హెడ్ ఆఫీస్‌కు వచ్చి కలవండి’ అని చెప్పి వెళ్లిపోయారు.
ఊహించని బహుమతి
జాయ్ అలూకాస్ చెప్పిన రోజున సుకన్య తన భర్తతో త్రిసూర్ వెళ్లింది. ఆమె హెడ్డాఫీసులో అడుగుపెట్టిన వెంటనే వందలాది మంది ఉద్యోగులు హర్షధ్వానాలతో ఆమెను అభినందించారు. జాలీ అలూకాస్ తన భర్త జాయ్ అలూకాస్‌తో వచ్చి సుప్రియను అభినందించారు. సుప్రియ తబ్బిబ్బయ్యింది. దంపతులిద్దరూ ఆమెకు కొత్త ఇంటి తాళాలు బహూకరించారు. సుప్రియ నివ్వెరపోయింది. ‘నేను చేసింది మామూలు పనే’ అందామె.
అప్పుడు జాలీ అలూకాస్ ‘కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా మంచి పనులు చేసి ఉంటావు. వాటన్నింటి ఫలితమే ఇది. ప్రపంచంలో మంచితనానికి కొదవ ఉండకూడదు. మంచితనం వ్యాపిస్తూనే ఉండాలి’ అని çసుప్రియను అభినందించింది. ఈ అందమైన ఘటన ఎందరికో నచ్చుతోంది. స్ఫూర్తినిస్తోంది. రొటీన్‌లో పడి తమను తాము మర్చిపోయినవారు తమలోని మంచితనాన్ని వెతుక్కునేలా చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment