ప్రతీకాత్మక చిత్రం
వంద సహాయాలు చెయ్యండి. చేతిలో ఓ వంద పెట్టడం వేరు. పప్పులు ఉప్పులు కడుపుకు. గుప్పెట్లో డబ్బు.. గుండెకు!! డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుణ్ని దగ్గరే ఉంచుతుంది.
గిఫ్టా? కవర్‌లో పెట్టి క్యాషా? ఏ చదివింపుల ఫంక్షన్‌కు వెళ్లే ముందైనా సహజంగా వచ్చే సందేహమే. డబ్బున్నవాళ్లకు క్యాష్ ఇవ్వక్కర్లేదు అనిపిస్తుంది. వాళ్లకు గిఫ్టూ అక్కరయి ఉండదు కానీ డబ్బులిస్తే బాగోదని గిఫ్టే ఫ్యాక్ చేయిస్తాం. కొందరికి డబ్బే ఇస్తాం. తెలుస్తుంటుంది.. వాళ్లకు డబ్బే మంచి కానుక అవుతుందని. గత మే నెలలో ఒక వార్త వచ్చింది. పేపర్‌లలో వచ్చిన వార్త కాదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్త. ముంబైలో ఉంటున్న ఆమిర్ ఖాన్.. ఢిల్లీలోని కొన్ని మురికివాడల నిరుపేదలకు గోధుమపిండి బస్తాలతో పాటు, వాటిల్లో పదిహేను వేల రూపాయల చొప్పున నగదు కూడా పెట్టి ఇచ్చాడని. ఒక్కోబస్తాలో పదిహేను వేల రూపాయలు! అంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినవారిలో ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడు! ‘‘నేను అంతటి వాడిని కాదు’’ అన్నారు ఆమిర్ ఆ వార్త విని నవ్వుకుని.
ఆమిర్‌లా చేయలేదు కానీ, కేరళలో సెబానమ్మ అనే రోజువారీ కూలీ నిజంగా అలానే చేసింది. అయితే తన స్థోమతకు తగ్గట్టు తన ఇంటి భోజనం ప్యాకెట్‌లో వంద రూపాయలు ఉంచి, వరద బాధితులకు పంపించింది. అది ఎవరికి వెళ్లేదీ ఆమెకు తెలియదు. వార్డులోని ప్రతి ఇంట్లోని వారూ ఒక్కో ప్యాకెట్ భోజనం కట్టి ఉంచితే, ఇంటికి వచ్చిన ‘కుదుంబశ్రీ’ వాలంటీర్‌లు ఆ ప్యాకెట్‌లను సేకరించుకుని వెళ్లి వరద బాధితులకు అందజేస్తారు. అలా సెబానమ్మ ఇచ్చిన ప్యాకెట్ ఓ పోలీసు అధికారికి అందింది! అదైనా.. నాణ్యత పరిశీలన కోసం దానిని తెరిచి చూసినప్పుడు ఆయనకు అందులో వంద నోటు కనిపించింది! ఆ ప్యాకెట్ ఎవరిదా అని ఆరా దీస్తే సెబానమ్మ గురించి తెలిసింది.
సెబానమ్మ అసలు పేరు మేరీ సెబాస్టియన్. చెల్లానమ్ గ్రామంలోని వారికి సెబానమ్మగా పరిచయం. అందరికీ ఏదో ఒక సహాయం చేస్తుండటంతో ‘అమ్మ’ అయింది. తను కూడా లాక్‌డౌన్ బాధితురాలే. మార్చి నెలాఖరులోనే కేటరింగ్‌లో తన ఉపాధిని కోల్పోయింది. కేరళలోని కొచ్చి నగర శివార్లలో ఉన్న కుంబలంగి దగ్గర వేలంపరంబిల్‌లో ఉంటుంది సెబానమ్మ. ఆ ప్రాంతం ఎర్నాకులం జిల్లా కిందికి వస్తుంది. చెల్లానమ్ వేలంపరంబిల్‌కు అనుకునే ఉంటుంది. అరేబియా సముద్ర తీర ప్రాంతం. ఇప్పుడా ప్రాంతం అంతా వరద ముంపులో ఉంది. ప్రాణాలు మాత్రమే మిగుల్చుకుని ఖాళీ కడుపుల్తో నిలబడ్డారు చెల్లానమ్‌లోని వారు. అందరూ ఎవరి సాయం వాళ్లు చేస్తున్నారు. సెబానమ్మ కూడా తనకు చేతనైన సాయం చేస్తోంది. ఆ సమయంలోనే ‘కుదుంబశ్రీ’ పథకం కింద తను ఇవ్వవలసిన భోజనం ప్యాకెట్‌లో ఓ వంద రూపాయలు కూడా పెట్టి పంపింది.
‘‘ఈ పరిస్థితుల్లో వంద చాలా పెద్ద మొత్తం కదమ్మా అని నా కొడుకు అన్నాడు. వాడికి నేను ఒకటే చెప్పాను. దేవుడి దయ మన మీద ఉంది. వాళ్లున్నంత కష్టంలో మనం లేము. లేము కాబట్టి వాళ్లను మనమే ఆదుకోవాలి అని. అర్థం చేసుకున్నాడు. తనూ చేతనైన సహాయం చేస్తున్నాడు..’’ అని పోలీసు అధికారి తనకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో చెప్పింది సెబానమ్మ.
సన్మాన కార్యక్రమంలో సెబానమ్మ (మేరీ సెబాస్టియన్)
Comments
Please login to add a commentAdd a comment