సారీ.. నో కామెంట్!
విప్లవ కవి వరవరరావుకు ఫోన్ చేసి ‘నేను–నా దైవం’ శీర్షికకు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ‘నేనూ దైవమా!!’ అన్నారు. పోనీ... దైవత్వాన్ని ‘నేను–నా విప్లవం’గా మార్చి చెప్పండి అని అడిగాం. లేకపోతే ఆయన దగ్గర్నుంచి ఏం సమాధానం వస్తుందో మాకు తెలుసు. అదేంటంటారా... ‘సారీ.. నో కామెంట్’.
► దేవుణ్ణి నమ్మే కుటుంబంలో పుట్టి, దేవుణ్ణి నమ్మని వారు ఎలా అయ్యారు?!
వరవరరావు: యూనివర్సిటీలో చేరే వరకూ దేవుడి ఉనికిపై నాకు ఎలాంటి ఆలోచనలూ లేవు. ఎం.ఎ చేస్తున్నప్పుడు ఎంతోమందిని చదివాను, అలాగే ఎంతో సాహిత్యాన్ని! అందులో గురజాడ, శ్రీశ్రీ, చలం.. వంటి వారెందరో ఉన్నారు. ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయాలూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాంతో ఒక నిశ్చయానికి వచ్చాను. మనిషి దేవుణ్ణి సృష్టించాడు తప్ప, మనిషిని సృష్టించిన దేవుడు లేడని.
► డార్విన్, మార్క్స్ కూడా మీకు తోడైనట్లున్నారు?
జీవ పరిణామక్రమంలో ఆది మానవుడు అనంతర మానవుడిగా మారడానికి శ్రమ కారణమైంది. ఆహారాన్వేషణలో, ఆహార ఉత్పత్తిలో భాగంగా మెదడు వృద్ధి చెందింది. అది వికసించింది. ఉత్పత్తికి శ్రమ ఆధారమైంది. డార్విన్ చెప్పిన పరిణామక్రమం, మార్క్స్ ఏంగిల్స్ చెప్పిన శ్రమ ఆధారంగా ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్న వాళ్లలో నేనూ ఒకడిని.
► తర్కాలతో దేవుణ్ణి అందుకోలేమనే వారూ ఉన్నారు కదా!
మనిషి పండు తిన్నాడు. గింజలు విసిరేశాడు. అవి పది చెట్లు అయ్యాయి. ఆ పది చెట్ల ఫలాలు వందల చెట్లకు కారణం అయ్యాయి. ఆ క్రమంలోనే మనిషి రుతువులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. రోగానికి కారణమేంటి, చావుకు కారణమేంటి? అని జవాబులు వెతకడం మొదలుపెట్టాడు. తనకు అర్థమైనదాన్ని జ్ఞానంగా ఆపాదించుకుని, అర్థంకాని దానిని అలౌకిక శక్తిగా ఊహించుకున్నాడు...
► ... ఒక్క నిమిషం.. అలౌకిక శక్తి అవసరం మనిషికి ఏమిటి?
మార్క్స్ ఏమన్నాడంటే... తనను తాను వివరించుకోలేనప్పుడు మనిషి సృష్టించుకున్నదే దైవరూపం అని. సమాజం, వ్యవస్థలు ఎలా మారుతుంటే దేవుని రూపం అలా మారుకుంటూ వచ్చింది. వ్యవసాయంలో ఉన్న మనిషికి రాయి, పశువు, గుర్రం, పాము దేవుళ్లయ్యాయి. ఇవన్నీ వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. భూమిని దున్నుతున్నప్పుడు రాయి అడ్డు వస్తే ఆ రాయీ వారికి దేవుడైంది. వాటి మీద శ్లోకాలు కట్టి కీర్తించాడు. ప్రకృతిని ఆరాధించాడు. పంట పండటానికి కారణమైన వరుణుడిని, సూర్యుడిని... పంచభూతాలను దేవుళ్లను చేశాడు.
► మీరూ.. అలా దేవుణ్ణి నమ్మిన కుటుంబాల నుంచే వచ్చారు. అలాంటిది మీ భావనలలో ఇంత వైరుధ్యం ఏమిటి?
వరంగల్‌లోని చిన్న పెండ్యాల మా ఊరు. మొదటి నుంచీ మాది రాజకీయ కుటుంబం. నేను పుట్టేనాటికి మా పెద్దన్నయ్యలిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. మా బాపు (నాన్న) వైష్ణవ ఆరాధకుడు. దేవుణ్ణి కొలిచేవాడు. మా ఇంట్లో పెరుమాళ్ల ఇల్లు అని ఒక గది ఉండేది. ఆ పక్కనే వంట గది. పెరుమాళ్ల ఇంట్లో ఏముండేవో మాకు తెలిసేది కాదు. బహుశా! రాగి, ఇత్తడి విగ్రహాలు ఏవో ఉండేవనుకుంటా. ఆ విగ్రహాలు, దీపపు చెమ్మలు శుభ్రంగా కడిగి, తుడిచిచ్చే పని మా అమ్మది. వంటింట్లో నుంచే పెరుమాళ్ల ఇంట్లోని మా బాపుకు అందించేది. ఆయన వాటినందుకొని తలుపులేసుకుని దేవుణ్ణి పూజించుకునేవాడు.
మా అమ్మకు పెరుమాళ్ల ఇంట్లోకి పోయి మా బాపుతో కూర్చుని పూజ చేసే అర్హత లేదు! మా ఇళ్లలో పురుషుడు చేసే పూజను స్త్రీ చూస్తే దేవుడికి దృష్టి దోషం కలుగుతుందట. అందుకని మా అమ్మ చూస్తున్నప్పుడు మా బాపు పూజ చేసేవాడు కాదు. అంటే.. ఆమెకు దేవుణ్ణి చూసే అర్హత లేదు. ఆమెకు జ్ఞానార్హత లేదు. అసలు మను ధర్మ శాస్త్ర ప్రకారం దేవుణ్ణి పూజించే అర్హత స్త్రీకి లేదట. ఎంత అన్యాయం?
► ఆ అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేదా?
అప్పటికి లేదు. నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి మా బాపు చనిపోయాడు. మా అమ్మకు పూజ చేసే అర్హత లేదంటే ఆయన దృష్టిలో ఆమె పిల్లలమైన మాకూ లేనట్టేగా! పైగా, నేను చెడు నక్షత్రంలో పుట్టాను అని, నా వల్ల ఇంటికి అరిష్టం అని నన్ను దేవుడికి పరిచయం చేయాలనుకోలేదేమో ఆయన. ఇక మా అమ్మను ఆయన ఒక పనిముట్టుగానే భావించేవాడు. ఆయన్ని చెడ్డవాడని నేను అనను. మూఢవిశ్వాసాలున్న ఒక సగటు మనిషి ఆయన.
మా అమ్మ అన్నీ సిద్ధం చేసి ఉంచితే, దేవుణ్ణి మొక్కుకొని బయటపడి, పది మంది పిల్లలను పోషించడానికి నాలుగు పైసల కోసం పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడేవాడే తప్ప ఆయనకైనా దేవుని గురించి ఆలోచించే తీరిక ఉండేదని అనుకోను. కష్టం చేసేటోడికి దేవుణ్ణి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? లీజర్లీ క్లాస్.. దేవుణ్ణి సృష్టించింది. కష్టం చేసేవాడికి సమస్యలు వస్తే పరిష్కారాలకు దేవుడున్నాడని ఆ వర్గం చెబితే నమ్మిన వారిలో ఆయనా ఒకరు.
► దేవుణ్ని కొందరికే ఎందుకు అలా పరిమితం చేశారు?
మా బాల్యంలో వినాయక పూజ బ్రాహ్మణులు, కోమట్లు మాత్రమే చేసేవారు. రేగడి మట్టితో చిన్న బొమ్మ చేసి, పూజించి ఇంటెనెక బావిలో వేసి, కోమట్ల ఇంటి మీద రాళ్లు వేసేవారు. వాళ్ల చేత తిట్లు తింటే మంచి జరుగుతుందనేది మరో మూఢ నమ్మకం. ఇప్పుడు దేవుడు మార్కెట్ అయిపోయాడు. కులాన్ని బట్టి దేవుడు, వర్గాన్ని బట్టి దేవుడు పుట్టుకొచ్చారు. గ్రామదేవతలంతా శూద్రుల దేవుళ్లు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు అగ్రకులస్తుల దేవతలు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు దేవుణ్ణి సృష్టించుకున్నారనే కదా.
రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.. ‘మీరు ఎంత అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట మీ భౌతిక జ్ఞానం పనిచేస్తుంది’అని అంటారు. ఉదాహరణకు.. స్వారోచిత మనుసంభవం తీసుకుందాం. ప్రవరుడు అనే ఆయన యజ్ఞయాగాదులు చేసుకునేవాడు. అతడి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. కైలాసగిరి, హిమాలయాలు అన్నీ తిరిగానని చెప్పాడు. ఓ పసరు వల్ల ఇదంతా సాధ్యమన్నాడు.
ప్రవరుడు కోరితే అతని పాదాలకు ఆ పసరు రాసాడు. ప్రవరుడు వెంటనే హిమాలయాలకు వెళ్లాడు. తిరిగివద్దామంటే పసరు కరిగిపోయి రాలేక పోయాడు. అప్పుడు రాళ్లపల్లి వారు ఏమంటారంటే– ‘అంత శక్తి గల పసరు అలా ఎలా కరిగిపోయింది?’ అని. అంటే, ఎక్కడో మన ఇంద్రియ జ్ఞానం పనిచేస్తుందన్నమాట. అయితే ఆ ప్రశ్నించే గుణాన్ని అణచివేస్తే తప్ప పాలకులు మనల్ని పరిపాలించలేరు. అణిచివేతకు సరైన ఆయుధం ‘దేవుడు.’ ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నవి రెండే రెండు శక్తులు.. ఒకటి పెట్టుబడి, రెండవది మూఢభక్తి.
► దేవుడి నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు!
దేవుళ్ల పరిణామ క్రమం అది (నవ్వుతూ). రాజకీయమే కాదు, వ్యాపారం కూడా అయిపోయాడు దేవుడు. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయమే తీసుకుందాం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అయోధ్యలో గతంలో ఉన్నది రామ్‌లల్లా అనే దేవుడి గుడి. రామ్‌లల్లా మార్వాడీల దేవుడు. మార్వాడీలు చేసేది వ్యాపారం. ఆ విధంగా చూస్తే రాముడు... వ్యాపారుల దేవుడు అనుకోవాలి.
► సృష్టిలో మీకు ఎక్కడైనా దైవాంశం గోచరిస్తుందా?
డిగ్రీలో మాకు సంస్కృతం సబ్జెక్ట్ ఉంది. అక్కడ కొన్ని విషయాలు తెలిశాయి. స్త్రీలు సంస్కృతం చదవకూడదు. మాట్లాడకూడదట. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు సంస్కృతం మాట్లాడుతాడు. శకుంతల శూద్రులు మాట్లాడే పాళీ భాషలో మాట్లాడుతుంది. అంతెందుకు రామాయణంలో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీత పాళీ భాష మాట్లాడుతుంది. మా లెక్చరర్ని ఓ ప్రశ్న అడిగాను. ‘అయ్యా! సీత, శకుంతల పాళీ భాష మాట్లాడితే రాముడికి, దుష్యంతుడుకి అర్థం అవుతుంది. వాళ్లు రాజుల కాబట్టి అన్ని భాషలు నేర్చుకొని ఉంటారు. మరి రాముడు, దుష్యంతుడు సంస్కృతం మాట్లాడితే సీతకు, శకుంతలకు ఎలా తెలుస్తుంది?’ అని.
ఇది ఇప్పటికీ అర్థం కాదు. నేను పండితులను ఇదే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఏర్పరచిన నియమాల వల్ల మీరే దేవతగా పూజించే సీతకు సంస్కృతం రావడానికి వీల్లేదు. రుషి దగ్గర పెరిగిన శకుంతలకు సంస్కృతం రావడానికి వీల్లేదు. నస్త్రీ స్వాతంత్య్రమర్హతి.. స్త్రీకి స్వాతంత్య్రం ఉండకూడదన్నారు. ఇది మనువు నిర్దేశించింది. ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా..?’ అనే ద్రౌపది ప్రశ్నకు ఎలాగైతే సమాధానం లేదో.. దీనికీ లేదు. సంస్కృతమంతా ‘డు’ అంతాలే! అంటే మగవాడికి సంబంధించినవే! తర్వాత రాణులు వచ్చి ఉంటారు కానీ, మన సంస్కృతం రాయబడింది రాజుల గురించే! దేవుడికి స్త్రీ అవసరం లేనప్పుడు, స్త్రీకి దేవుడెందుకు? ఈ సృష్టిలో మనిషికి జన్మనిస్తుంది కాబట్టి స్త్రీయే దేవత.
► మీరు స్త్రీ పక్షపాతి అనుకోవచ్చా?
అన్యాయాన్ని ప్రశ్నించడం నా నైజం. నాకు ముగ్గురు కూతుళ్లు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఎలా చెప్పాలి?! ఈ సాహిత్యాన్నే వారికీ పరిచయం చేశాను. వాళ్లూ మనిషి సృష్టించిన దేవుణ్ణి నమ్మరు.
► చావు పుట్టుకలను దేవుడి నుంచి వేరుచేసి చూడగలమా?
చావు పుట్టుకులను వివరించకపోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. పంచేంద్రియాలతో ఈ శరీరం రూపు కడుతుంది. ఆత్మ అనేది పెద్ద అబద్దం. మళ్లీ జన్మ ఉంటుందన్నది కూడా అబద్ధం. మనిషి దేవుడు తన కన్నా గొప్పగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడికి నాలుగు తలలు పెట్టాడు. నాలుగు చేతులు పెట్టాడు.
నాకంటే గొప్పవాడైన దేవుడికి నాలాగే ఒక్క తలకాయ ఉంటే ఎట్లా బలవంతుడవుతాడు అనుకున్నాడు. అందుకనే ఆ నాలుగు తలల ఊహ. రాక్షసుడికి నాలుగు కాదు పది తలలు ఉండాలనుకున్నాడు. రావణాసురుడికి పది తలలు పెట్టాడు. వాడిని ఒక్క తల ఉన్న మనిషి ఎలా చంపాడంటే, అవతారం అన్నారు! పక్షి లేకుండా విమానం లేనట్టే, ఒక చేప లేకుండా ఓడ లేనట్టే, ఒక మనిషి లేకుండా దేవుడు లేడు. దేవుడికి ప్రాతిపదిక మనిషే!
► మీరు మావోయిజాన్ని నమ్ముతారు. మావోను మీ దైవం అనుకోవచ్చా?
మావోయిజం త్యాగం గురించి చెబుతుంది. ఒక మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ఇంటిని, భార్య బిడ్డలను వదిలేసి అడవుల్లో జీవిస్తాడు. దున్నేవారికే భూమి కావాలి. కష్టం చేసేవాడికే ఫలితం కావాలని పోరాడతాడు. పోరాటం ఎప్పటికీ దైవసంకల్పం కాదు. పరిస్థితుల ప్రోద్బలం. అందుకే నేను మనిషి నమ్ముతాను. మనిషి కోసం కష్టపడే మనిషే దేవుడు.
► కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరిని తలచుకుంటారు?
మా అమ్మను తలుచుకుంటాను. దైవాలకన్నా గొప్పది అమ్మే!
► ఇప్పుడంటే సరే, మీ చిన్నప్పుడు పండగలు జరపడం, దేవుళ్లను ఆరాధించడం జరగలేదా? మీ పేరులోనే ఒక దేవుడు ఉన్నాడు?
మేం ఐదుగురు అన్నదమ్ములం, ఐదుగురు అక్కచెల్లెళ్లు. పదిమందిలో నేను ఆఖరివాడిని. మూలా నక్షత్రంలో పుట్టానని దానికి విరుగుడుగా అళ్వారు స్వాములలో ఒకరిపేరైన వరవరస్వామి పేరు నాకు పెట్టారు మా బాపు. ఆయన పట్వారీ గుమాస్తా. ఆయన కష్టం మా అందరి కడుపు నింపడానికే సరిపోయింది. ఆస్తులు కరిగి పోయాయి. మా మూడో అన్నయ్య టెన్త్ పాసై ఉద్యోగం చేసేవరకూ రెండు పూటలూ గడవని పరిస్థితి. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేది. తార్కిక సాహిత్యానికి దగ్గరగా ఉండేవాళ్లం. అందుకేనేమో కష్టకాలంలోనూ దేనినీ గుడ్డిగా నమ్మలేదు. పెద్ద పండగ అంటే అంతా సామూహికంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగే తెలుసు. ఇప్పుడు పండగలను కూడా మార్కెట్ శక్తులే శాసిస్తున్నాయి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి