చరిత్రలో తలకిందులైన అంచనాలు
చరిత్రలో తలకిందులైన అంచనాలు
Published Sat, Oct 29 2016 6:50 PM | Last Updated on Thu, Oct 4 2018 4:56 PM
ఇప్పటి నుంచి సరిగ్గా వందేళ్ల తర్వాత అంగారక గ్రహంపై మానవులు సుస్థిర నివాసం ఏర్పాటుచేసుకొని జీవిస్తారని 'స్పేస్‌ఎక్స్' సీఈవో ఎలాన్ మస్క్ అంచనా వేశారు. ఆ దిశగా అప్పుడే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. వందేళ్ల తర్వాత ఆయన అంచనా నిజం అయితే దూరదృష్టి గల జీనియస్ అని, ప్రముఖ కాల్పనికుడని కీర్తిస్తారు. ఆయన అంచనా నిజం కాకపోనూ వచ్చు. ఇలా చరిత్రలో తలకిందులైన అంచనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని...
1903లో.. ఆటోమొబైల్ రంగానికి పురోగతి లేదని, ఎప్పటికైనా మానవుడికి గుర్రపు బగ్గీలే దిక్కని అప్పుడే కొత్తగా ఏర్పాటైన హెన్రీ ఫోర్డ్ కంపెనీ న్యాయవాదితో మిచిగాన్ సేవింగ్స్ బ్యాంక్ అధ్యక్షుడు వాదించారు. హŸరేస్ రాకమ్ ఆయన మాటలను వినిపించుకోకుండా ఫోర్డ్ కంపెనీలో తన ఐదువేల డాలర్ల పెట్టుబడిని 1.25 కోట్ల డాలర్లకు పెంచారు. ఫోర్డ్ కంపెనీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో తెల్సిందే.
1911లో.. త్వరలోనే ఆల్కమీ (ఓ ఖనిజాన్ని బంగారంలోకి మార్చడం) విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని, అప్పుడు ట్రక్కు నిండా ఉన్న ఇనుప కడ్డీలను స్వచ్ఛమైన బంగారంగా మార్చడం చాలా సులువని థామస్ ఎడిసన్ అంచనా వేశారు. ఆయన అంచనా ఇప్పటికీ నెరవేరలేదు.
1912లో.. వైర్‌లెస్ టెలిగ్రామ్ యుగంలోకి మానవుడు అడుగుపెడుతున్నందున ఇక యుద్ధాలనేవే జరగవని, దేశాల మధ్య కమ్యూనికేషన్ సమస్య ఉండదు కనుక యుద్ధాలు వచ్చే ఆస్కారమే లేదని గుగ్లీ ఎల్మో మార్కోని అంచనా వేశారు. ఆయన ఊహించిన దానికన్నా కమ్యూనికేషన్ల వ్యవస్థ మరింత బలపడినా, యుద్ధాలు సమసిపోలేదనే విషయం మనకు తెలిసిందే.
1920లో.. భూ వాతావరణాన్ని దాటుకొని ఏ రాకెట్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించలేదని, ఇది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదని 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక అభిప్రాయపడింది. 1969లో అపోలో 11 అంతరిక్షనౌక చంద్ర మండలంపైకి ప్రయాణించిన విషయం తెల్సిందే.
1955లో.. అణు విద్యుత్‌తో పనిచేసే వాక్యూమ్ క్లీనర్లు పదేళ్లలో మార్కెట్‌లోకి వస్తాయని లెవిట్ వాక్యూమ్ కంపెనీ అధ్యక్షుడు అలెక్స్ లెవిట్ అంచనా వేశారు. రాలేదు కదా!
1966లో.. 1999 నాటికి మనిషి నడుము బెల్టులకు కట్టుకునే రాకెట్లు వస్తాయని, వాటితో విహరించవచ్చని, ఆకాశంలో ప్రయాణించే కార్లు వస్తాయని, వాతావరణాన్ని సానుకూలంగా నియంత్రించే అద్దాల డోమ్‌ల కింద నగరాలు వెలుస్తాయని రీడర్స్ డైజెస్ట్ మాగజైన్ అంచనా వేసింది. మానవుడు రాకెట్ లేదా విమానాల లాంటి చిన్న పరికరాలపై గాల్లో ఎగరడం, ఆకాశంలో ప్రయాణించే కార్లు ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి. వాతావరణాన్ని నియంత్రించే డోమ్‌లు నగరాలపై రాలేదు. భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం పెరిగిపోతే ఆలాంటి గ్లాస్ డోమ్‌లు అవసరం అవుతాయేమో!
1977లో.. ఇంటికో కంప్యూటర్ కోరుకునే ప్రసక్తే రాదని డిజిటల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు కెన్ ఓస్లెన్ భావించారు. ఎందుకంటే అప్పట్లో ఆయన కంపెనీ కంప్యూటర్లు చిన్న ఇల్లుకంటే పెద్దగా ఉండేవి.
1995లో.. ఏడాదిలో ఇంటెర్నెట్ విస్తరించి సూపర్‌నోవాలాగా పేలిపోతుందని ఈథర్నెట్ కేబుల్ వ్యవస్థాపకులు రాబర్ట్ మెట్‌కాఫ్ అంచనా వేశారు. ఎందుకంటే ఆయన కేబుల్ భవిష్యత్తులో అవసరమైన డేటాను ఇముడ్చుకునే అవకాశం లేదని ఆయన భావించారు.
1997లో.. మార్కెట్‌లో గ్యాడ్జెట్ మేకర్లను తట్టుకోలేక హార్డ్‌వేర్ గేమ్ నుంచి త్వరలోనే నిష్క్రమిస్తావని ప్రముఖ ఆపిల్ కంపెనీని 'వైర్డ్ మేగజైన్' హెచ్చరించింది. ఆ తర్వాత నాలుగేళ్లలోనే వెయ్యి పాటల గ్యాడ్జెట్లను ఆపిల్ కంపెనీ మన జేబుల్లో పెట్టింది. ఇప్పుడా కంపెనీ ఏ స్థాయిలో ఉందో మనకు తెల్సిందే.
Advertisement
Advertisement