al zawahiri
-
అంతం కాదిది ఆరంభం
కొన్నేళ్ళుగా ప్రపంచానికి కంటిలో నలుసుగా మారి, అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తున్న అంతర్జాతీయ ఇస్లామిస్ట్ ఉగ్రమూక అల్‌ఖైదాకు ఇది ఊహించని దెబ్బ. అఫ్ఘానిస్థాన్లోని కాబూల్‌లో ప్రపంచం కంటపడకుండా నివసిస్తున్న అల్‌ఖైదా అధినేత అయ్మాన్ అల్–జవాహిరీని అమెరికా మాటు వేసి, జూలై 31 ఉదయం చాటుగా మట్టుబెట్టడంతో ఒక అధ్యాయం ముగిసింది. ‘9/11’ దాడులకు తెగబడిన ముష్కరమూకను నలిపి, నాశనం చేయాలని ప్రపంచపు పెద్దన్న ఇరవై ఒక్క ఏళ్ళుగా పగతో రగిలిపోతోంది. 2011లో ఒసామా బిన్ లాడెన్నూ, ఇప్పుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించిన జవాహిరీని హతమార్చడం అమెరికా నిఘా వ్యవస్థ ఎంత బలమైనదో మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది. అంతకన్నా ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రమూకలకు స్థావరంగా మార్చబోమంటూ తాలిబన్లు చేసుకున్న ‘దోహా ఒప్పందం’లోని డొల్లతనం బయట పడింది. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లాంటివి ఇప్పటికీ ఉగ్రమూకలకు స్వర్గధామాలే అన్న కఠిన వాస్తవం పొరుగున ఉన్న భారత్ సహా ప్రపంచమంతటినీ మరోసారి అప్రమత్తం చేస్తోంది. 1998 ఆగస్టులో తూర్పు ఆఫ్రికాలో అమెరికా ఎంబసీపై బాంబుదాడి నుంచి ‘9/11’గా పాపు లరైన 2001 సెప్టెంబర్ 11 నాటి న్యూయార్క్ ప్రపంచ వాణిజ్య కేంద్ర జంట భవనాలపై వైమానిక దాడి వరకు... అగ్రరాజ్యంపై అల్‌ఖైదా తెగబడిన అనేక సందర్భాల్లో తెర వెనుక సూత్రధారి జవాహిరియే. నేత్రవైద్యుడి నుంచి తీవ్రవాదిగా మారిన 71 ఏళ్ళ జవాహిరి అప్పట్లో అల్‌ఖైదాలో నంబర్ టూ. 2011లో పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికన్ కమెండోలు లాడెన్‌ను గుట్టుగా మట్టుపెట్టినప్పటి నుంచి ఆ సంస్థకు ఆయనే నంబర్ వన్. అల్‌ఖైదా కొంత తెర వెనక్కి వెళ్ళాక, ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐసిస్) లాంటి హింసాత్మక జిహాదిస్టు పిల్లమొలకలు మొలిచి, ఐరోపాలో తెగబడడం చూస్తున్నాం. కొంత బలహీనపడ్డా, కార్యకర్తల సమీకరణ సత్తా ఉన్న సైద్ధాంతికుడిగా జవాహిరి అమెరికా మొదలు ఇండొనేసియా దాకా అనేక దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే వచ్చారు. అమెరికా ఎప్పుడో ఆయన తలకు 2.5 కోట్ల డాలర్ల భారీ వెల కట్టింది. భారత్‌కూ ముప్పు తేవాలని జవాహిరి ఆరాటపడ్డారు. ‘భారత ఉపఖండ అల్‌ఖైదా’ (ఏక్యూ ఐఎస్)ను ఆరంభిస్తున్నట్టు 2014లోనే ఒక వీడియోలో ప్రకటించిన ఆయన నిరుడు హురియత్ నేత గీలానీ చనిపోయినప్పుడు సంతాపం ప్రకటిస్తూ, కశ్మీర్ అంశాన్ని భుజానికెత్తుకొనే యత్నం చేశారు. ఈ ఏడాది కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తినప్పుడూ సాయుధపోరు చేయాలంటూ ముస్లిమ్ లను రెచ్చగొట్టేందు ప్రయత్నించారు. కానీ, సహనశీల భారతావనిలో ఆ పప్పులుడకలేదు. నిన్నటి దాకా గుర్తు తెలియనిచోట గడుపుతున్నాడనుకుంటున్న ఈ ఉగ్రనేత సాక్షాత్తూ కాబూల్ నడిబొడ్డున, అఫ్ఘాన్ ప్రభుత్వ పెద్దలెందరో నివసిస్తున్న భవనంలో సకుటుంబంగా కాపురమున్న వైనం దిగ్భ్రాంతికరం. నెలల క్రితమే ఆయన ఆచూకీ కనిపెట్టిన అమెరికా గూఢచారులు ఆనుపానులన్నీ చూసుకొని, చుట్టుపక్కల ఎవరికీ ఏమీ కాకుండా చిత్రమైన హిల్ఫైర్ క్షిపణుల రిమోట్ డ్రోన్ దాడితో లక్ష్యాన్ని ఛేదించిన వైనం కొన్నాళ్ళు కథలు కథలుగా చెప్పుకొనే జేమ్స్‌బాండ్ తరహా విన్యాసం. తాజా ఆపరేషన్‌తో తీవ్రవాదంపై పోరులో అమెరికా ప్రతిష్ఠ కొంత పెరగవచ్చు. ఉపఖండంలో పర్యవసానాలు అంతకన్నా పెరుగుతాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు హడావిడిగా వెనక్కి తగ్గాక, అఫ్ఘాన్‌లో బలవంతాన పగ్గాలు చేజిక్కించుకున్న పిడివాద తాలిబన్లకూ, వారి ప్రభుత్వానికీ ఇవాళ్టికీ అంతర్జాతీయ గుర్తింపు అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో తమకు తెలియకుండానే జవాహిరి తమ నట్టింట్లోనే తలదాచుకున్నాడని తాలిబన్ సర్కార్ బొంకినా నమ్మేవారెవరూ లేరు. తమ దేశ సార్వభౌమాధికారానికి అమెరికా తాజా రహస్య దాడులు విఘాతమని కాబూల్ వాదన. మామూలుగానైతే ఆ మాటకు అంతో ఇంతో మద్దతు లభించేదేమో! కానీ, పది పడగల పాముకు నేటికీ పాలు పోసి పెంచుతున్న వైనం బట్టబయలయ్యాక తాలిబన్లను ఎవరూ బాహాటంగా సమర్థించ లేరు. ఇక, జవాహిరి వ్యవహారంలో పాకిస్థాన్ ఇవ్వాల్సిన సంజాయిషీ సైతం చాలానే ఉంది. దీర్ఘకాలం పాక్‌లో తలదాచుకొని, ఇప్పుడు అఫ్ఘాన్‌లోనూ పాకిస్థానీ స్థావర ఉగ్రమూక హక్కానీ నెట్వర్క్ నీడలోనే అల్‌ఖైదా అధినేత కాలక్షేపం చేశాడనేది సుస్పష్టం. ఇన్నాళ్ళూ కడుపులో పెట్టుకొని కాపాడిన ఉగ్రసారథితో తమకే బంధం లేదని దాయాది దేశం చెబితే హాస్యాస్పదం. ఆ మాటకొస్తే, స్వలాభం కోసం ఇప్పుడు పాకిస్థానే అతని ఉప్పందించిందనే వాదనా వినిపిస్తోంది. తాజా దాడితో అమెరికా పగ చల్లారిందేమో కానీ, ఆన్లైన్ విషప్రచారంతో వివిధ దేశాలకు వ్యవస్థను విస్తరించిన జిహాదిస్టు గ్రూపులు తోక తొక్కిన తాచులా లేచే ప్రమాదం ఉంది. అధినేతను కోల్పోయి ఇప్పటికి ఆ స్థాయి వారసుడెవరూ లేకపోయినా, కొత్త గ్రూపులను కూడగట్టుకొని అల్ ఖైదా ప్రతీకారం తీర్చుకోజూస్తుంది. ఇక తాలిబన్లు సరేసరి. అందుకే, జవాహిరి ఒక్కడి మరణంతో సమస్త ఉగ్రవాదం సమసిపోయినట్టు కాదు. ప్రపంచానికిస్తున్న హామీలకు విరుద్ధంగా ముష్కర మూకలను పెంచిపోషిస్తున్న పాక్, అఫ్ఘాన్లపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. ఉప ఖండంలో శాంతి సుస్థిరతలకు భంగం కలిగించే చర్యల్ని అనుమతించబోమనాలి. అందుకే, ‘9/11’ దాడుల్లో మరణించిన 3 వేల మంది కుటుంబాల కన్నీటి కథకు జవాహిరి అంతం ఒక ముగింపని బైడెన్ అన్నారు కానీ, దశకంఠుడి లాంటి ఉగ్రసంస్థలపై యుద్ధంలో ఇది మరో మజిలీ మాత్రమే! -
హెల్ఫైర్ మిసైల్.. తిరుగులేని మారణాస్త్రం
అల్‌ఖైదా నంబర్ 2గా ఉన్న అహ్మద్ హసన్ అబూ ఖైర్ అల్‌మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్‌లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి. 2000లో యెమన్‌లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్ అహ్మద్ అల్ బదావీని 2019లో హెల్ఫైర్ ఆర్9ఎక్స్‌తోనే సీఐఏ మట్టుబెట్టింది. ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్ఫైర్తోనే మట్టుబెట్టింది. 2020లో ఇరాన్‌కు చెందిన మేజర్ జనరల్ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది. అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్ఫైర్ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్‌ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది. అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్‌ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్‌ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్‌హీడ్ మార్టిన్–నార్త్రోప్ గమ్మన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్‌స్ట్రీట్ జర్నల్ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు. అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్ఫైర్కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్9ఎక్స్ రకం. ఇది వార్‌హెడ్ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి. దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్లాన్ బీగా హెల్ఫైర్ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్ఫైర్ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్ విజయవంతంగా పని పూర్తి చేశారు. -
9/11 మాస్టర్ మైండ్ జవహరీ హతం.. 15 ఏళ్లకే జవహరీ ఉగ్రబాట
వాషింగ్టన్: అల్–జవహరీ ఈజిప్టు రాజధాని ౖకైరోలో 1951లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే ‘జమాత్ అల్–జిహాద్’ పేరిట సొంతంగా ఒక సంస్థను స్థాపించాడు. విరోధులను అంతం చేయడమే దీని లక్ష్యం. ఇది ఈజిప్టులో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందింది. 1981 అక్టోబర్ 6న ఉగ్రవాద దాడుల్లో ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ బలయ్యారు. ఈ దాడుల్లో ‘జమాత్ అల్–జిహాద్’ హస్తం ఉన్నట్లు తేలింది. జవహరీ వైద్య విద్య అభ్యసించాడు. కొన్నాళ్లు సర్జన్‌గా పనిచేశాడు. జీవ ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ఒక ల్యాబ్‌ను నడిపించాడు. గతంలో ఓ కేసు విచారణలో భాగంగా జవహరీ కోర్టుకు హాజరయ్యాడు. ‘‘మేము త్యాగాలు చేశాం. ఇస్లాం విజయం సాధించేవరకూ ఎన్ని త్యాగాలు చేయడానిౖకైనా సిద్ధంగా ఉన్నాం’’ అంటూ కోర్టు గదిలో గట్టిగా అరిచాడు. లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను జవహరీకి మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలయ్యాక దక్షిణాసియాకు చేరుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్‌కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించాడు. 1988లో ఒసామా బిన్ లాడెన్ అల్‌ఖైదాను స్థాపించాక అందులో చేరాడు. చురుగ్గా కార్యకలాపాలు సాగించాడు. 1990 తర్వాత తన ‘జమాత్ అల్–జిహాద్’ సంస్థను అల్‌ఖైదాలో విలీనం చేశాడు. అతి తక్కువ కాలంలోనే లాడెన్‌కు నమ్మిన బంటుగా మారాడు. 1990వ దశకంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలు తొలిసారిగా జవహరీపై దృష్టి పెట్టాయి. అల్‌ఖైదా ముఠాలో అతడి ప్రతిష్ట విపరీతంగా పెరిగిపోయింది. అల్‌ఖైదా నిర్వహించే విలేకరుల సమావేశాల్లో లాడెన్ పక్కనే జవహరీ తప్పనిసరిగా కనిపించేవాడు. 1997లో అఫ్గానిస్తాన్‌లో ఉన్నప్పుడు ఈజిప్టు పర్యాటకులను చంపేందుకు ప్లాన్ చేశాడు. 1998లో లాడెన్ అల్‌ఖైదా ఉప నాయకుడిగా జవహరీ పేరును ప్రకటించాడు. అంటే ఉగ్రముఠాలో లాడెన్ తర్వాతి స్థానం జవహరీదే కావడం గమనార్హం. అణ్వాయుధాలు సంపాదించుకోవాలన్న అల్‌ఖైదా ఆశయం వెనుక జవహరీ ప్రోత్సాహం ఉంది. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో.. ఆత్మాహుతి దాడులకు వ్యూహాలు రచించడంలో జవహరీ దిట్ట. నిధులు సేకరించడంలోనూ నేర్పరి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ అల్–జవహరీని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. పదేళ్ల క్రితం అమెరికా నేవీ సీల్స్ దాడుల్లో లాడెన్ హతమయ్యాక జవహరీ అల్‌ఖైదా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు. చెల్లాచెదురైన అల్‌ఖైదాను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న అల్‌ఖైదా సభ్యులకు సుప్రీంలీడర్‌గా దిశానిర్దేశం చేశాడు. అఫ్గాన్‌పై అమెరికా సేనలు పట్టు బిగించడంతో జవహరీ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. వేర్వేరు దేశాల్లో తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. జవహరీ చనిపోయాడన్న వాదనలు సైతం వినిపించాయి. కానీ, అమెరికా నిఘా సంస్థలు నమ్మలేదు. ఓపికగా వేట కొనసాగించాయి. చివరకు అఫ్గానిస్తాన్‌లోనే అంతం చేశాయి. అమెరికన్లను హతమార్చడమే లక్ష్యం 1998 ఆగస్టు ఏడో తేదీన టాంజానియా, కెన్యాలోని అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. జవహరీ నేతృత్వంలోనే ఈ దాడులకు వ్యూహాలు రూపొందించారు. అప్పుడు అతడి వయసు 47 సంవత్సరాలు. ఇక అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ‘2001 సెప్టెంబర్ 11’ దాడుల వెనుక లాడెన్‌తో కలిసి కీలక పాత్ర పోషించారు. ‘‘అమెరికన్లను, వారి మిత్రులను అంతం చేయడమే ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడున్నా సరే హతమార్చాలి’’ అని 1998లో తన మేనిఫెస్టోలో జవహరీ స్పష్టంగా రాసుకున్నాడు. ‘సెప్టెంబర్ 11’ దాడుల తర్వాత అమెరికాలో మరిన్ని దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అఫ్గానిస్తాన్‌లో జీవ ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కానీ, అఫ్గాన్‌పై అమెరికా దండెత్తడంతో అతడి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారసుడు ఆదెల్? జవహరీ మరణంతో అల్ ఖైదా నాయకునిగా ఈజిప్టు మాజీ సైనికాధికారి మహ్మద్ సలాహ్ అల్ దిన్ జైదన్ అలియాస్ సైఫ్ అల్ ఆదెల్ (60) పేరు గట్టిగా వినవస్తోంది. అల్ ఖైదా అగ్ర నేతల్లో పిన్న వయస్కుడితడే. ఎవరీ ఆదెల్? ఈజిప్టుకు చెందిన ఆదెల్ మాజీ కల్నల్. అల్‌ఖైదా వ్యవస్థాపక సభ్యుడు. అమెరికా, బ్రిటిష్ సైనికులనెందరినో చంపాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర రిక్రూట్మెంట్లు, నిధుల కోసం 1980ల్లో ఒసామా బిన్ లాడెన్ నెలకొల్పిన మక్తాబ్ అల్ ఖిద్మత్ (ఎంఏకే)తో కూడా అనుబంధముంది. లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గానూ వ్యవహరించాడు. అప్పుడే జవహరీతోనూ పరిచయమేర్పడింది. 1993లో సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు 19 మంది అమెరికా సైనికులను చంపి మృతదేహాలను వీధుల గుండా ఈడ్చుకెళ్లారు. ఈ దాడి ఆదెల్ కనుసన్నల్లోనే జరిగింది. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన దాడులు, పెంటగాన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై జరిగిన దాడులతోనూ ఇతడికి సంబంధముంది. దీంతో అమెరికా ఆదెల్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి అతడి తలపై కోటి డాలర్ల నజరానా ప్రకటించింది. లాడెన్ మరణం తర్వాత కీలక వ్యూహకర్తగా ఎదిగాడు. 20 ఏళ్లుగా ఇరాన్‌లోనే ఉన్నట్టు అనుమానం. సిరియాలోని ఉగ్ర ముఠాలకు టెలిగ్రాం ద్వారా సూచనలిస్తాడని చెబుతారు. లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్‌ను కూడా 2019లో అమెరికా సైన్యం మట్టుబెట్టింది. అల్‌ఖైదా పగ్గాలు ఇతని చేతుల్లోకే వెళ్తాయని మిడిల్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ అంటోంది. -
భారత ఉపఖండంలో అల్‌ఖైదా శాఖ!!
అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. ఇప్పుడు భారత ఉప ఖండంలో కూడా ఓ కొత్త శాఖ తెరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ నాయకుడు ఆయమాన్ అల్ జవహరి ప్రకటించారు. భారత ఉప ఖండంలోనే చిత్రీకరించిన ఓ వీడియో మెసేజిలో ఈ విషయం తెలిపారు. ఆన్లైన్ జీహాదిస్ట్ ఫోరంలో ఈ వీడియో కనిపించింది. ప్రధానంగా బర్మా, బంగ్లాదేశ్‌లతో పాటు.. భారతదేశంలోని కొన్ని భాగాల్లో ముస్లిం ఖలీఫా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కొత్త దళం పనిచేస్తుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పినట్లుంది.