హెల్‌ఫైర్‌ మిసైల్‌.. తిరుగులేని మారణాస్త్రం | All about Hellfire R9X – the drone missile with razor-sharp blades | Sakshi
Sakshi News home page

హెల్‌ఫైర్‌ మిసైల్‌.. తిరుగులేని మారణాస్త్రం

Published Wed, Aug 3 2022 5:43 AM | Last Updated on Wed, Aug 3 2022 5:43 AM

All about Hellfire R9X – the drone missile with razor-sharp blades - Sakshi

అల్‌ఖైదా నంబర్‌ 2గా ఉన్న అహ్మద్‌ హసన్‌ అబూ ఖైర్‌ అల్‌మస్రీని 2017లో సిరియాలోని ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లో విమానం ద్వారా ప్రయోగించిన హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌తో చంపింది. దీన్ని ప్రయోగించడం అదే తొలిసారి.

2000లో యెమన్‌లో 17 మంది అమెరికా నావికులను బలి తీసుకున్న బాంబు దాడికి కారకుడైన జమాల్‌ అహ్మద్‌ అల్‌ బదావీని 2019లో హెల్‌ఫైర్‌ ఆర్‌9ఎక్స్‌తోనే సీఐఏ మట్టుబెట్టింది.

ఉగ్ర దాడులకు నిధులు సమకూరుస్తున్న మొహిబుల్లా అనే ఉగ్రవాదిని 2019లో హెల్‌ఫైర్‌తోనే మట్టుబెట్టింది.

2020లో ఇరాన్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీని బలి తీసుకుంది కూడా హెల్‌ఫైరేనంటారు. ఇది అమెరికా, ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకదశలో పరిస్థితి యుద్ధం దాకా వెళ్లింది.


అల్‌ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీని మట్టుబెట్టేందుకు సీఐఏ ఉపయోగించిన హెల్‌ఫైర్‌ శ్రేణి క్షిపణి అత్యంత అధునాతనమైన మారణాస్త్రం. దీన్ని అమెరికా అమ్ములపొదిలోని రహస్య అస్త్రంగా చెప్పవచ్చు. మిగతా క్షిపణుల్లా ఇది పేలడం, భారీ విధ్వంసం సృష్టించడం వంటివేమీ ఉండవు. కానీ కచ్చితత్వం విషయంలో దీనికి తిరుగు లేదు. నిర్ధారిత టార్గెట్‌ను నిశ్శబ్దంగా ఛేదించడం ద్వారా పని పూర్తి చేస్తుంది.

అత్యంత వేగంగా వెళ్తున్న కార్లో కూడా డ్రైవర్‌ను వదిలేసి కేవలం వెనక సీటులో ఉన్న టార్గెట్‌ను మాత్రమే చంపే సత్తా దీనికుందని చెబుతారు. 2011లో ఒబామా హయాంలో అమెరికా రక్షణ శాఖ–సీఐఏ వీటిని సంయుక్తంగా రూపొందించాయి. లాక్‌హీడ్‌ మార్టిన్‌–నార్త్‌రోప్‌ గమ్మన్‌ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించాయి. 2019లో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయట పెట్టేదాకా వీటి గురించి బయటి ప్రపంచానికి తెలియదు.

అమెరికా పాటిస్తున్న గోప్యత కారణంగా హెల్‌ఫైర్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలేవీ పెద్దగా అందుబాటులో లేవు. ఇందులో పలు రకాలున్నాయి. జవహరీపై దాడికి వాడింది అమెరికా ఇటీవలే అభివృద్ధి చేసిన ఆర్‌9ఎక్స్‌ రకం. ఇది వార్‌హెడ్‌ వంటిదేమీ లేకుండా ఐదడుగుల పై చిలుకు పొడవు, 45 కిలోల బరువుతో చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్ని విమానం నుంచి గానీ, డ్రోన్‌ నుంచి గానీ ప్రయోగిస్తారు. అత్యంత వేగంతో లక్ష్యాన్ని తాకే సమయంలో దీని ముందు భాగం నుంచి ఆరు అత్యంత పదునైన బ్లేడ్లు బయటికొస్తాయి.

దాన్ని పూర్తిస్థాయిలో ఛిద్రం చేస్తూ దూసుకెళ్తాయి. పరిసరాలకు గానీ, పక్కనుండే వారికి గానీ ఎలాంటి నష్టం లేకుండా పని చక్కబెట్టడం వీటి ప్రత్యేకత. దీన్ని నింజా బాంబ్‌ అని, బ్లేడ్ల కారణంగా ఫ్లయింగ్‌ జిన్సు అని పిలుస్తారు. అగ్ర స్థాయి ఉగ్రవాద నేతలు తదితరులను ఇతర ప్రాణనష్టం లేకుండా చంపాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తుంటారు. 2011లో అప్పటి అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ హత్యకు ప్లాన్‌ బీగా హెల్‌ఫైర్‌ క్షిపణులను కూడా సిద్ధంగా ఉంచారట. కానీ హెల్‌ఫైర్‌ క్షిపణులæ అవసరం లేకుండానే నేవీ సీల్స్‌ విజయవంతంగా పని పూర్తి చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement