భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవపై మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల దుమారం
ప్రపంచ నాయకుల్ని, యూఎస్ జనరల్‌ని, చట్ట ప్రతినిధులను కూడా ముంచేశాడు
రంగంలోకి దిగిన ఎఫ్‌బీఐ : వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.
నకిలీ సీఐఏ ఏజెంట్‌గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్‌ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్‌లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్‌బీఐ విచారిస్తోంది.
ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్‌కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.
శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్‌లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు.
మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.
మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్‌పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్‌ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్‌కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment